బెంగళూరు డ్రగ్స్‌ కేసు: ఆ గుట్టంతా జుట్టులోనే..!

Bangalore Drugs Case Accused Cutting Hair - Sakshi

వెంట్రుకలు కత్తిరించేసుకుంటున్న డ్రగ్స్‌ నిందితులు 

90 రోజుల వరకు కేశాల్లో మాదకద్రవ్యాల అవశేషాలు 

ఇప్పుడు అవి కూడా చిక్కడం కష్టమేనంటున్న నిపుణులు 

కేసులు పెట్టినా.. సాక్షులు ఎదురు తిరిగే అవకాశాలే ఎక్కువ 

సినీతారల కేసులన్నీ సరాసరి అటక మీదికే! 

సాక్షి, హైదరాబాద్‌:  బెంగళూరు డ్రగ్స్‌ కేసు ఇప్పుడు పలువురు ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ కేసులో భాగంగా కర్ణాటక పోలీసులు హైదరాబాద్‌కు చెందిన పలువురు వ్యాపారులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా జుట్టు కత్తిరించుకునే పనిలో ఉన్నారని తెలిసింది. ఎవరైనా డ్రగ్స్‌ తీసుకుంటే.. వారి రక్తం, మూత్రం శాంపిళ్లతోపాటు తలవెంట్రుకలను పరీక్షించడం ద్వారా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. డ్రగ్స్‌ తీసుకున్న వారి వెంట్రుకల్లో దాదాపు 90 రోజుల (3 నెలల) పాటు వాటి అవశేషాలు ఉంటాయి. రక్తం, మూత్రంలలో కొన్నివారాలపాటు మాత్రమే డ్రగ్స్‌ ఆనవాళ్లు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొన్న వారు జుట్టు కత్తిరించుకునే పనిలో పడ్డారని అంటున్నారు. 

సాంకేతిక ఆధారాలపై దృష్టి.. 
బెంగళూరు డ్రగ్స్‌ కేసులో పోలీసులు కొందరు ప్రముఖులను విచారించాల్సి ఉంది. ఇందుకోసం వారి సెల్‌ఫోన్‌ లొకేషన్‌ డేటా తెప్పించుకుంటున్నారని సమాచారం. డ్రగ్స్‌ పెడ్లర్లకు, వారికి మధ్య జరిగిన వాట్సాప్‌ చాటింగ్, డ్రగ్స్‌ కోసం జరిగిన యూపీఐ, ఆన్‌లైన్‌ మనీ ట్రాన్సాక్షన్స్, బెంగళూరు ఫామ్‌ హౌజ్‌ పార్టీలకు ఎవరెవరు వెళ్లారన్నది నిర్ధారించేందుకు గూగుల్‌ టైంలైన్‌ డేటాను విశ్లేషిస్తున్నారని తెలిసింది. డ్రగ్స్‌ సరఫరాను నిర్ధారించుకున్న అనంతరం.. ఎవరు వినియోగించారన్న విషయంపై పోలీసులు దృష్టి సారించనున్నారు. 

సినీతారల కేసులన్నీ అటకపైకే! 
మనదేశంలో డ్రగ్స్‌ కేసులో అనేక మంది సినీతారలు జైలుపాలయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్, శాండల్‌వుడ్‌ నటులు పలువురు జైలుకు వెళ్లారు. అయితే హైదరాబాద్‌లో ఓ సినీనటుడి కాల్పుల కేసు, ఆ తర్వాత పలుమార్లు వెలుగుచూసిన సినీతారల డ్రగ్స్‌ కేసులు మాత్రం ముందుకు సాగలేదు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు దేశాన్ని కుదుపు కుదిపిన విషయం తెలిసిందే. చాలా మంది సినీ ప్రముఖులను విచారించడం ఒక దశలో జాతీయమీడియా దృష్టిని ఆకర్షించింది. కానీ ఆ తర్వాత అడుగుకూడా ముందుకు పడలేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top