బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్‌ | Bandi Bhageerath Remanded to 14 Days Custody | Sakshi
Sakshi News home page

బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్‌

May 17 2026 12:23 AM | Updated on May 17 2026 1:14 AM

Bandi Bhageerath Remanded to 14 Days Custody

లొంగుబాటా.. అరెస్టా?
భగీరథ్‌ను పోలీసులు అరెస్టు చేశారా? లేక అతనే పోలీసులకు లొంగిపోయాడా? అనే అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. 8 రోజులుగా పరారీలో ఉన్న భగీరథ్‌ దేశం విడిచి పారిపోకుండా లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. 20 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న క్రమంలో పోలీసు అకాడమీ వద్ద నిందితుడు భగీరథ్‌ను పట్టుకున్నామని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ ఎం.రమేష్‌ తెలిపారు. కాగా.. ‘భగీరథ్‌ను పోలీసులు అరెస్టు చేయలేదని, తానే స్వయంగా ఇద్దరు లాయర్లతో కలిసి పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయారని’ పేర్కొంటూ బండి సంజయ్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.  

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి అప్పా జంక్షన్‌లోని పోలీసు అకాడమీ వద్ద సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) డీసీపీ పి.శోభన్‌ కుమార్, అతని బృందం నిందితుడు భగీరథ్‌ను శనివారం రాత్రి 8:15 గంటలకు అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ నిరాకరించిన మర్నాడే ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అరెస్టు తర్వాత భగీరథ్‌ను భారీ బందోబస్తు నడుమ రాత్రి 9:05 గంటలకు పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఠాణాలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ సుమారు రెండున్నర గంటల పాటు భగీరథ్‌ను సుదీర్ఘంగా విచారించారు. రాత్రి 11:35 గంటలకు భగీరథ్‌ను మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఆ తర్వాత నిందితుడిని మేడ్చల్‌లోని మేజిస్ట్రేట్‌ నివాసంలో హాజరుపరిచారు. ఆయన సమక్షంలోనే భగీరథ్‌ వాంగ్మూలాన్ని పోలీసులు మరోసారి నమోదు చేశారు. అలాగే బాధితురాలు మైనర్‌ బాలిక, ఆమె తల్లి వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు రెండుసార్లు రికార్డ్‌ చేసిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం మేజిస్ట్రేట్‌ నిందితుడికి 14 రోజుల జ్యుడీíÙయల్‌ రిమాండ్‌ విధించారు. దీంతో భగీరథ్‌ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. 

ఉదయం నుంచే హడావుడి 
శనివారం ఉదయం పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు బంజారాహిల్స్‌ రోడ్‌ నం.3లోని ఆరోరా కాలనీలోని బండి సంజయ్, భగీరథ్‌ మేనమామ కరీంనగర్‌లోని కార్తికేయ ఆసుపత్రిలో డాక్టర్‌ సీహెచ్‌ వంశీకృష్ణ ఇంట్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రెండు గంటల పాటు దాడులు చేసిన అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌లతో పాటు పలు కీలక సమాచారాన్ని సేకరించారు. శనివారం ఉదయం నుంచే భగీరథ్‌ పోలీసుల ఎదుట లొంగిపోతాడనే ప్రచారం జరిగిన నేపథ్యంలో పేట్‌ బషీరాబాద్‌ ఠాణా, చర్లపల్లి జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భాజపా కార్యకర్తలు, ఇతరులు ఎవరూ లోనికి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.   

అపస్మారక స్థితిలో ఉండగా... 
కుత్బుల్లాపూర్‌లోని సుచిత్ర ప్రాంతంలో నివసించే ఓ మైనర్‌ బాలికతో భగీరథ్‌కు గతేడాది పరిచయం ఏర్పడింది. తరచూ ఆమెను కలవడం, ఫోన్‌లో మాట్లాడుతూ ఆమె నమ్మకాన్ని చూరగొన్నాడు. శారీరకంగా ఆమెను లొంగదీసుకునేందుకు పలుమార్లు ప్రయత్నించాడు. ఈక్రమంలో గతేడాది డిసెంబర్‌ 31న మొయినాబాద్‌లోని తన ఫామ్‌హౌస్‌కు బాలికను తీసుకెళ్లిన భగీరథ్‌.. ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు. ఆమె అపస్మారక స్థితిలో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర మానసిక, శారీరక కుంగుబాటుకు గురైన బాలిక ఈ విషయాన్ని తల్లికి తెలిపింది. దీంతో ఆమె ఈనెల 8న పేట్‌ బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సున్నితమైన కేసు కావడంతో కేసు విచారణ నిమిత్తం ప్రభుత్వం కూకట్‌పల్లి జోన్‌ డీసీపీ రితిరాజ్‌ పర్యవేక్షణాధికారిగా ‘సిట్‌’ను నియమించిన సంగతి తెలిసిందే. పేట్‌ బహీరాబాద్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ) పోక్సోలోని సెక్షన్‌ 11 రెడ్‌విత్‌ 12, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 74, 75 కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ సెక్షన్లను పరిశీలించిన పర్యవేక్షణాధికారి రితిరాజ్‌ మంగళవారం బాధితురాలిని మరోసారి విచారించారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భగీరథ్‌పై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్‌ చేసిన లైంగిక చర్యలకు సంబంధించిన సెక్షన్లను సూచించే పోక్సో–2012 చట్టంలోని సెక్షన్‌ 5(ఐ) జోడించారు. కేసు నమోదైన నాటి నుంచి 8 రోజులుగా నిందితుడు బండి భగీరథ పరారీలో ఉన్నాడు. దీంతో 20 బృందాలు నిందితుడి కోసం ఢిల్లీ, హైదరాబాద్, కరీంనగర్‌లో తీవ్రంగా గాలించారు. 

మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధాని, రాష్ట్రపతికి లేఖ 
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు లేఖ అందింది. సంజయ్‌ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలి తరుఫు న్యాయవాది పప్పు నాగేశ్వర రావు ఈ లేఖను రాశారు. బండి సంజయ్‌ కేంద్ర మంత్రి పదవిలో కొనసాగితే అధికార బలంతో కేసును పక్కదారి పట్టించే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బాధితులకు ఇటీవల బహిరంగంగా బెదిరింపులు కూడా వచ్చాయని, అందువల్ల తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఆ లేఖలో డిమాండ్‌ చేశారు. 

చట్టంపై గౌరవం ఉంది: బండి సంజయ్‌ 
‘మా అబ్బాయి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టం పైఉన్న గౌరవంతో అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించా’నని బండి సంజయ్‌ మీడియాతో అన్నారు. ‘నేను ఇంతకు ముందే చెప్పిన. చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే స్టేషన్‌లో అప్పగిద్దామనుకున్నా. కానీ, లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాడు. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్‌ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది. ఈరోజు కూడా బెయిల్‌ వస్తుందనే లాయర్లు చెబుతున్నారు. అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించాను. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకముంది. సోమవారం కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావొద్దనే ఉద్దేశంతో మా అబ్బాయిని విచారణకు పంపించానని బండి సంజయ్‌ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement