ఖననం చేసేముందు  కన్ను తెరిచిన పురిటికందు

Baby Boy Open Eyes At Burial Grounds In Karimnagar - Sakshi

సాక్షి, కోల్‌సిటీ(కరీంనగర్‌): చనిపోయాడనుకుని ఖననం చేయడానికి తీసుకెళ్తున్న మగశిశువు శ్వాస తీసుకోవడంతో వెంటనే పిల్లల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖనిలో చోటుచేసుకుంది. మంథని మండలానికి చెందిన ఓ మహిళ 26 వారాల గర్భిణి. నెలలు నిండకున్నా పురిటి నొప్పులు రావడంతో ఆమెను గోదావరిఖని లక్ష్మీనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

ఏప్రిల్‌ 9న డెలీవరీ డేట్‌ ఇచ్చినా, పురిటినొప్పులు తీవ్రం కావడంతో వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. తక్కువ బరువుతో మగశిశువు జన్మించాడు. అయితే ఆ శిశువు బతకడం కష్టమని, ఏదైనా పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో శిశువును రాత్రంతా తల్లి వద్దే ఉంచారు బంధువులు. ఆదివారం ఉదయం శిశువును గమనించగా శ్వాస తీసుకోలేదు.

దీంతో చనిపోయాడని భావించిన బంధువులు ఖననం చేయడానికి గోదావరి నది ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడికెళ్లాక శిశువుపై ఉంచిన గుడ్డను తీసి చూశారు. శిశువులో కదలిక కనిపించడంతో హుటాహుటిన లక్ష్మీనగర్‌లో గల మరో పిల్లల ఆస్పత్రికి తరలించారు. తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, మెరుగైన వసతులు కలిగిన పిల్లల ఆస్పత్రికి తరలించాల్సి ఉందని అక్కడి వైద్యులు చెబుతున్నారు.

సరిగా పరీక్షించకుండానే శిశువులో శ్వాస ఆడటం లేదని మొదట పురుడుపోసిన ఆస్పత్రి సిబ్బంది చెప్పడం వల్లే తాము ఖననం చేయడానికి తీసుకెళ్లామని శిశువు బంధువులు ఆరోపిస్తున్నారు. జరిగిన ఘటనలో తమ నిర్లక్ష్యమేమీ లేదని, మెరుగైన ఆస్పత్రికి తరలించాలని తాము ముందే చెప్పగా, చనిపోయాడని భావించి బంధువులే శిశువును శ్మశానానికి తీసుకెళ్లారని లక్ష్మీనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యులు వివరించారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top