రూ.11 వేల కోట్లకు పైగా బకాయిలు | Arrears Over Rs 11,000 Crore In Telangana | Sakshi
Sakshi News home page

రూ.11 వేల కోట్లకు పైగా బకాయిలు

Aug 31 2020 4:16 AM | Updated on Aug 31 2020 4:16 AM

Arrears Over Rs 11,000 Crore In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో బిల్లులన్నీ కొండలా పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో కార్యకలాపాలు స్తంభించిపోవడంతో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు పేరుకుపోయాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొద్దికొద్దిగా పుంజుకుంటున్నా, ప్రభుత్వం ఇతర ప్రధాన పథకాలకు ఎక్కువగా నిధులు వెచ్చిస్తుండటంతో సాగునీటి బిల్లులకు మోక్షం కలగడంలేదు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కొన్ని ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టుల కింద చెల్లింపులు చేసినప్పటికీ ఇంకా రూ.11,989 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. 

కొంత ఇచ్చినా..ఇంకా చాలా పెండింగ్‌..
ఈ ఏడాది మార్చిలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో సాగునీటి శాఖకు రూ.11 వేల కోట్ల కేటాయింపులు చేశారు. ఇదిలా ఉండగా ఏప్రిల్‌ నుంచి కరోనా విస్తృతి పెరిగిన అనంతరం ఆ ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పడటంతో బిల్లుల చెల్లింపు పూర్తిగా నిలిచిపోయింది. జూన్‌ రెండోవారం నుంచి పరిస్థితి కొంత మెరుగైనా రైతుబంధు, ఇతర ప్రాధాన్య పథకాలకు నిధులు ఇవ్వాల్సి రావడంతో సాగునీటి ప్రాజెక్టుల బిల్లుల చెల్లింపు జరగలేదు. దీంతో బిల్లులు భారీగా పేరుకుపోయాయి. జూన్‌ చివరలో కేవలం రూ.785 కోట్ల మేర మాత్రమే చెల్లింపులు జరగ్గా, జూలై, ఆగస్టు నెలల్లో రూ.3,300 కోట్ల మేర బిల్లులు చెల్లించారు. అయినప్పటికీ మరో రూ.11,989 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో కరెంట్‌ బిల్లులు, భూసేకరణ బిల్లులు రూ.5 వేల కోట్ల మేర ఉన్నా, పనులకు సంబంధించిన బిల్లులు రూ.6వేల కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అధికంగా కాళేశ్వరం పరిధిలోనే రూ.4,648 కోట్లు పెండింగ్‌లో ఉండగా, పాలమూరు–రంగారెడ్డిలో రూ.1,993 కోట్లు, డిండిలో రూ.298 కోట్లు, దేవాదులలో రూ.700 కోట్లు మేర పెండింగ్‌లో ఉన్నాయి.

ఇక చెరువులకు సంబంధించిన మైనర్‌ ఇరిగేషన్‌ కింద రూ.775 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో మిషన్‌ కాకతీయకు సంబంధించినవే రూ.350 కోట్ల వరకు ఉన్నాయి. ఈ బిల్లులకోసం ఏజెన్సీల ప్రతినిధులు, చిన్న కాంట్రాక్టర్లు నీటి పారుదల శాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే చెల్లింపులు జరుగుతుండటంతో కాంట్రాక్టర్లు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ బిల్లులు ఇప్పించాలంటూ మొర పెట్టుకుంటున్నారు. కిస్తీల చెల్లింపులకోసం ఒత్తిళ్లు పెరుగుతుండటం, బ్యాంకుల్లో కొత్త రుణాలు దొరక్కపోవడం, బయట వడ్డీలు పెరుగుతుండటంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. చాలా చోట్ల ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ల మేరకే టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు, ఇప్పుడు బ్యాంకు గ్యారంటీలు సమర్పించి అగ్రిమెంట్‌లు చేసుకునేందుకు వెనకాడుతున్నారు. ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బకాయిల చెల్లింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై వేచి చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement