Adilabad Wonder Book Record: గంటలో మూడున్నర లక్షల మొక్కలు..

Adilabad: Over 3 Lakh Saplings Planted In 1 Hour Wonder Book Records - Sakshi

‘రికార్డు’ మొక్కలు

ఆదిలాబాద్‌లో గంటలో మూడున్నర లక్షల మొక్కలు నాటిన ప్రజలు

వండర్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు

జిల్లావ్యాప్తంగా పది లక్షల మొక్కలు..  

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌లో మొక్కలు నాటే కార్యక్రమం రికార్డులకెక్కింది. పట్టణ శివారు దుర్గానగర్‌లోని 250 ఎకరాల అటవీ ప్రాంతంలో ఆదివారం 35 వేల మంది గంటలో మూడున్నర లక్షల మొక్కలు నాటారు. ఇది టర్కీలో గతంలో 3.2 లక్షల మొక్కలు నాటిన రికార్డును అధిగమించి వండర్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కెక్కిందని ఆ సంస్థ ఇండియా ప్రతినిధి బి.నరేందర్‌గౌడ్‌ తెలిపారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రం, మెడల్‌ను రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధులకు అందించారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజు సందర్భంగా జోగు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

మొత్తంగా జిల్లావ్యాప్తంగా పది లక్షల మొక్కలు నాటినట్టు జోగు రామన్న తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 24 శాతం నుంచి 27 శాతానికి చేరిందన్నారు. ఏడేళ్లుగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందన్నారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు రూ.6 వేల కోట్లు కేటాయించామన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ ప్రకృతి సహజంగా ఆక్సిజన్‌ అందించేందుకు తన పుట్టినరోజు సందర్భంగా మిలియన్‌ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top