Aadhaar: ఎక్కడ పడితే అక్కడ నమోదు కేంద్రాలు ఇదిగో ఆధారం!

Aadhaar Enrollment Centers every where  - Sakshi

పాఠశాల విద్యార్థుల కోసం   ప్రభుత్వ కార్యాలయాల్లోనే పెట్టాలని నిబంధనలు 

కానీ ఇష్టారాజ్యంగా ప్రైవేటు ప్రాంతాల్లో నిర్వహణ

ఈ ఫొటోలో కనిపిస్తున్నది తాత్కాలిక ఆధార్‌ నమోదు కేంద్రం. జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడ్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల చిరునామాలో ఈ కేంద్రాన్ని నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. కానీ ఈ కేంద్రం నిర్దేశించిన చోటు కాకుండా ఓ ప్రైవేటు దుకాణంలో నిర్వహిస్తున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆధార్‌ నమోదు కేంద్రాల నిర్వహణ గాడితప్పింది. కేవలం బడి పిల్లల కోసం పాఠశాల ఆవరణలో మాత్రమే నిర్వహించాల్సిన ఈ కేంద్రాలు బహిరంగ మార్కెట్లో ప్రైవేటు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం... వాస్తవాలను గుర్తించినప్పటికీ పట్టనట్లు ఉండడంతో ఈ కేంద్రాల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను గాలికొదిలేసిన నిర్వాహకులు... ఇష్టారీతిన నూతన ఆధార్‌ నమోదు, సవరణ ప్రక్రియను సాగిస్తున్నారు. దీంతో ప్రజా సమాచార గోప్యతకు భంగం వాటిల్లుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

33 జిల్లాల్లో 876 ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కిట్లు... 
రాష్ట్రంలోని ప్రభుత్వ/ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు నూతన ఆధార్‌ కార్డుల జారీ, ఇప్పటికే జారీ చేసిన కార్డులకు సంబంధించి సవరణ తదితర సేవలను అందించాలనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఏకంగా పాఠశాల ఆవరణలోనే ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి లక్ష్యసాధన పూర్తయ్యే వరకు అక్కడే కొనసాగించేలా కార్యాచరణ రూపొందించింది.

ఇందులో భాగంగా రెండు ప్రైవేటు ఏజెన్సీలను ఎంపిక చేసిన పాఠశాల విద్యాశాఖ... ఏజెన్సీల వారీగా జిల్లాలను నిర్దేశిస్తూ నమోదు, సవరణ, అప్‌డేషన్‌ కోసం ప్రతేకంగా ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కిట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో ఒక ఏజెన్సీకి 20 జిల్లాల బాధ్యతలను అప్పగిస్తూ 526 ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కిట్లు ఇవ్వగా... మరో ఏజెన్సీకి 13 జిల్లాల బాధ్యతలు అప్పగిస్తూ 350 ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కిట్లను ఇచ్చింది.

ఈ ఏజెన్సీలు క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారుల సమన్వయంతో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ పూర్తి చేయాలి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు గతేడాది డిసెంబర్‌లో వెలువడగా... ఈ ఏడాది జనవరి నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 

నిబంధనలు గాలికి...
ప్రతి విద్యా ర్థికి చేరువలో ఆధార్‌ సర్వి సులను అందించాలనే లక్ష్యంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిబంధనలను ఏజెన్సీలు గాలికి వదిలేశాయి. క్షేత్రస్థాయిలో ఆపరేటర్లు, సూపర్‌వైజర్లను ఎంపిక చేసి వేతన చెల్లింపులతో నమోదు/సవరణ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది.

కానీ కాంట్రాక్టు పద్ధతిలో కాకుండా క్షేత్రస్థాయిలో ఆసక్తి ఉన్న వారికి ఏజెన్సీలు ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కిట్లను ఇచ్చేశాయి. దీంతో కిట్లు పొందిన వారు ఈ కేంద్రాలను ప్రైవేటు ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వ అధికారి సమక్షంలో కొనసాగాల్సిన ఈ కేంద్రాలు ఇప్పుడు అంగట్లో సరుకుగా ఎక్కడపడితే అక్కడ నిర్వహిస్తున్నారు.

పర్యవేక్షణకు మంగళం పాడారు... 
ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో నిర్వహిస్తున్న కేంద్రాల్లో ప్రతి దరఖాస్తునూ సంబంధిత పర్యవేక్షణ అధికారి వెరిఫై చేసిన తర్వాతే ఆమోదిస్తాం. కానీ పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన కిట్లతో నిర్వహిస్తున్న కేంద్రాలు ఇష్టానుసారంగా నడుస్తున్నాయి. పర్యవేక్షణ లేకపోవడం, దరఖాస్తుల పరిశీలన కొరవడడంతో ఆధార్‌లో పొరపాట్లకు అవకాశం ఉంటుంది.
– బైర శంకర్, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ మీసేవ ఫెడరేషన్‌ 

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top