ఆర్టీసీకి 910 కొత్త బస్సులు | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి 910 కొత్త బస్సులు

Published Tue, Sep 5 2023 1:52 AM

910 new buses for RTC: Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మూడునెలల్లో ఆర్టీసీకి 910 కొత్త బస్సులు సమకూరబోతున్నాయి. చాలా కాలంగా పాతబడ్డ బస్సులతో లాక్కొస్తుండగా, వాటిల్లోంచి కొన్నింటిని తుక్కుగా మార్చేసి.. కొత్త బస్సులు అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే టెండర్లు పిలవగా టాటా, అశోక్‌ లేలాండ్‌ కంపెనీలు తక్కువ కొటే షన్‌తో ముందుకొచ్చాయి.

టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నెగోషియేషన్స్‌ ద్వారా వాటి కొటేషన్‌ మొత్తాన్ని కొంతమేర తగ్గించేందుకు ఆర్టీసీ అధి కారులు చర్చలు జరుపుతున్నారు. మరికొద్ది రో జుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి, రెండు కంపెనీలు ఒకే ధరకు ముందుకొచ్చేలా చేసి, వాటికే ఆర్డర్‌ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ నెలలోనే కంపెనీ లకు బస్సులు ఆర్డర్‌ ఇస్తే...బస్‌ బాడీల నిర్మా ణానికి మూడు నెలల సమయం పడుతుంది. 

ఎక్స్‌ప్రెస్‌ బస్సులు 540
ఆర్టీసీలో బాగా డిమాండ్‌ ఉన్న ఎక్స్‌ప్రెస్‌ కేటగిరీని బలోపేతం చేయాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం అద్దె బస్సులుపోను సొంతంగా 1,800 వరకు ఎక్స్‌ప్రెస్‌ బస్సులున్నాయి. ఇవి ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తూ ఆర్టీసీకి మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. దూర ప్రాంత పట్టణాల మధ్య ఇవి తిరుగుతున్నాయి.

కొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో 540 కొత్త ఎక్స్‌ప్రెస్‌ బస్సులు సమకూర్చుకోవాలని ఆర్టీసీ అనుకుంటోంది. వాటి రాకతో డొక్కు ఎక్స్‌ప్రెస్‌ బస్సులు అదే సంఖ్యలో తొలగిస్తారు. వాటిల్లో కొన్నింటిని సిటీ బస్సులుగా, మరికొన్నింటిని పల్లెవెలుగు బస్సులుగా కన్వర్ట్‌ చేస్తారు. అంతమేర సిటీ, పల్లెవెలుగు పాత డొక్కు బస్సులను తుక్కుగా మారుస్తారు. 

స్లీపర్‌ కమ్‌ సీటర్‌ రాజధాని బస్సులు 50 లేదా 60  
ఇక దూరప్రాంత పట్టణాల మధ్య తిరుగుతున్న రాజధాని (ఏసీ) బస్సులకు కూడా మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఉన్న బస్సులు బాగా పాతబడిపోయాయి. వాటిల్లోంచి మరీ పాత బస్సులను తొలగించి కొన్ని కొత్తవి సమకూ ర్చాలన్న ఉద్దేశంతో 50 లేదా 60 బస్సులు కొంటున్నారు. ప్రస్తుతం రాజధాని కేటగిరీ బస్సు లన్నీ సీటర్‌ బస్సులే. తొలిసారి ఆ కేటగిరీలో స్లీపర్‌ బస్సులు సమకూర్చనున్నారు. పైన కొన్ని బెర్తులు, దిగువ సీట్లు ఉండే స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులు తీసుకోవాలని నిర్ణయించారు.

ఎట్టకేలకు పల్లెవెలుగుకు కొత్త బస్సులు
సాధారణంగా ఎక్స్‌ప్రెస్, రాజధాని బస్సులు పాతబడ్డాక వాటిని తొలగించి సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులుగా కన్వర్ట్‌ చేస్తారు. దీంతో ఆ బస్సులు చాలా పాతబడి ఉంటున్నాయి. అయితే కొత్తగా ఇప్పుడు 100 నుంచి 120 మధ్యలో కొత్త బస్సులు సమకూర్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం చాలా ఊళ్లకు అద్దె బస్సులే నడుస్తున్నాయి. మరో 200 కొత్త బస్సులు హైదరాబాద్‌ సిటీకి కేటాయిస్తారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement