కొలువుల కోసం ప్రత్యేక శిక్షణ! 

50 BC Study Centers Across Telangana To Train Unemployed Youth - Sakshi

నిరుద్యోగుల శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 50 బీసీ స్టడీ సెంటర్లు 

త్వరలో ఉద్యోగ ప్రకటనల నేపథ్యంలో స్వల్పకాలిక శిక్షణ 

కార్యాచరణ రూపొందించిన తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వశాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి నియామక సంస్థల చర్యలు వేగవంతమవడంతో అభ్యర్థులు సైతం అందుకు అనుగుణంగా సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్ల వైపు పరుగులు మొదలుపెట్టారు.

ఇప్పటికే ఒకదఫా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు మరోసారి స్వల్పకాలిక శిక్షణ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్‌ వెనుకబడిన తరగతుల అభ్యర్థుల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ ఇటీవల బీసీ స్టడీ సర్కిల్‌ అధికారులతో ఉచిత కోచింగ్‌పై పలు రకాల సూచనలు చేశారు. ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. 

జిల్లాలవారీగా స్టడీ సెంటర్లు 
బీసీ అభ్యర్థులకు స్వల్పకాలిక శిక్షణ నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 50 స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని బీసీ స్టడీ సర్కిల్‌ నిర్ణయించింది. బీసీ సంక్షేమ వసతిగృహాలు, ఇతర కమ్యూనిటీ భవనాల్లో తాత్కాలిక పద్ధతిలో తక్షణమే ఈ స్టడీ సెంటర్లను ప్రారంభించాలని మంత్రి గంగుల ఆదేశించారు. దీంతో అనువైన భవనాల లభ్యతపై ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు.

త్వరలో గ్రూప్‌–2, గ్రూప్‌–3, గ్రూప్‌–4తోపాటు గురుకుల కొలువులకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు చర్యలు వేగవంతం చేశాయి. ఇప్పటికే ఆ యా కేటగిరీల్లోని ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ పచ్చజెండా ఊపడంతో ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.

ఈ క్రమంలో బీసీ అభ్యర్థులకు వారి జిల్లా కేంద్రాల్లోనే శిక్షణలు ఇచ్చేవిధంగా స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12 బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వీటిల్లో కూడా స్వల్పకాలిక శిక్షణ తరగతులను అతిత్వరలో నిర్వహించాలని బీసీ స్టడీ సర్కిల్‌ భావిస్తోంది. వారంరోజుల్లోగా కోచింగ్‌కు సంబంధించి ప్రకటనలు వెలువరించే అవకాశం ఉంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top