నాసిరకం భోజనంతో విద్యార్థులకు అస్వస్థత

45 Students Fall Ill After Eating Meals in Siddipet Girls Gurukul School - Sakshi

45 మంది విద్యార్థులకు హాస్టల్‌లోనే వైద్యం

సిద్దిపేట అర్బన్‌ బాలికల గురుకుల పాఠశాలలో ఘటన

సిద్దిపేట అర్బన్‌: నాసిరకం భోజనం తిని 45 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిగా ఉడకని ఆహారం తిన్న విద్యార్థినులు రెండు, మూడు రోజులుగా కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు.

విషయం బయటకు పొక్కకుండా హాస్టల్‌లో ని ఓ గదిలో ఉంచి పుల్లూరు పీహెచ్‌సీ వైద్యులతో వైద్యం చేయిస్తున్నారు. విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలను స్థానిక ప్రజాప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షిస్తూ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు అస్వస్థతకు గురికావడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి.  

పునరావృతం కావొద్దు: కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌ 
విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే విషయాన్ని సామాజి క మాధ్యమాల ద్వారా తెలుసుకున్న అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వారిని అడగ్గా ప్రస్తుతం బాగా నే ఉందని విద్యార్థినులు సమాధానం చెప్పారు. పిల్లలు బాగా నే ఉంటే బయట ప్రచారం మరోలా జరుగుతోందని ఇలా ఎందుకు అని ప్రిన్సిపాల్‌ లలితను ప్రశ్నించగా హెడ్‌ కుక్‌ రాకపోవడంతో మరో వ్యక్తి వంట చేయగా నాణ్యత లోపించి విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని సమాధానం ఇచ్చింది.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినుల ఆరోగ్యం కుదుటపడే వరకు మెడికల్‌ సిబ్బంది అక్కడే ఉండి వైద్యసేవలందించాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top