చిల్లుపడిన పల్లె గుండె | 25 years completed nookalamarri encounter in karimnagar | Sakshi
Sakshi News home page

చిల్లుపడిన పల్లె గుండె

Jul 20 2025 11:16 AM | Updated on Jul 20 2025 11:16 AM

25 years completed nookalamarri encounter in karimnagar

నూకలమర్రి ఎన్‌కౌంటర్‌కు 25 ఏళ్లు

 ఏడుగురు నక్సల్స్‌ మృతి..∙ అప్పటి సిరిసిల్ల డీఎస్పీకి బుల్లెట్‌ గాయం

‘జనశక్తి’ ఉద్యమానికి ఎదురుదెబ్బ..∙ ఉర్రూతలూగించిన పాటలు

సిరిసిల్ల:  అది నూకలమర్రి పల్లె.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్‌ మండలంలోని ఓ ఊరు. 2000 జూలై 20వ తేదీన సాయంత్రం గోధూలి వేళ.. గొల్లొల్ల వాడలో తుపాకులు గర్జించాయి.. అధర్మ యుద్ధాన్ని సవాల్‌ చేస్తూ.. ముగ్గురు సాయుధులు సజీవ దహనమైతే.. నిరాయుధులైన నలుగురు కాల్చి చంపబడ్డారు. ఆ ఏడుగురి అమరత్వం ఏడు రంగుల సింగిడైంది. సిల్లుపడ్డ పల్లెగుండె కన్నీటి సంద్రమైంది. నూకలమర్రి ఎన్‌కౌంటర్‌కు సరిగ్గా నేటికి పాతికేళ్లు. ఆ ఎన్‌కౌంటర్‌ పర్యవసానంగా జనశక్తి ఉద్యమ ప్రస్థానం పతనమైంది. నూకలమర్రి.. ఎన్‌కౌంటర్‌కు 25 ఏళ్లు నిండిన సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఒక్కసారి వెనక్కి
పాతికేళ్ల కిందట అప్పట్లో నక్సలైట్లు సమాంతర ప్ర భుత్వాన్ని నడిపేవారు. అడవిలో ఉండే అన్నలు ‘పెద్దరాయుడిగా’ తీర్పులు ఇచ్చే వారు. మళ్లీ అప్పీళ్లు లేకుండా సమస్యకు ముగింపు ఉండేది. 1989లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి పార్టీ బలపరిచిన ఎన్‌.వీ.కృష్ణయ్య గెలిచారు. ఆ ఎన్నికల్లో సీనియర్‌ కమ్యూనిస్ట్‌ నేత చెన్నమనేని రాజేశ్వర్‌రావు డిపాజిట్‌ కోల్పోయారు. 1995 స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి సిరిసిల్ల ప్రాంతంలోని కొన్ని స్థానాల్లో జనశక్తి పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులుగా గెలిచారంటే ఆనాటి పరిస్థితులను అంచనా వేయవచ్చు.

ఆ వేళ ఏం జరిగిందంటే..
సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి జిల్లా కమిటీ సభ్యుడు(డీసీఎం) రణధీర్‌ అలియాస్‌ సుంకెట సాయిలు, మరో డీసీఎం జగన్‌ ఆధ్వర్యంలో ఆరుగురు సాయుధ నక్సలైట్ల దళం జూలై 19న (ఎన్‌కౌంటర్‌కు ముందు రోజే) సాయంత్రం 5 గంటలకే నూకలమర్రి ఊరి చివర ఉండే పొట్ల దేవయ్య ఇంట్లో ఆశ్రయం పొందారు. నూకలమర్రికి చెందిన పలువురు జనశక్తి సానుభూతిపరులను పిలిపించుకుని పార్టీ బలోపేతం.. ఉద్యమ నిర్మాణంపై మాట్లాడుతున్నారు. ఈక్రమంలో నక్సలైట్ల దళం నూకలమర్రిలో ఆశ్రయం పొందినట్లు పోలీసులకు సమాచారం అందింది. జూ లై 20న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సాయుధ పోలీసులు నూకలమర్రిలో నక్సలైట్లు ఆశ్రయం పొందిన ఇంటిని గుర్తించి చుట్టుముట్టారు. 

అప్పటికే నక్సలైట్ల దళం ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. పోలీ సులు రావడంతో నక్సలైట్లు అ ప్రమత్తమయ్యా రు. జనశక్తి దళనేతలు రణధీర్, జగన్‌లు కాల్పులు ప్రారంభించారు. అప్పటి సిరిసిల్ల డీఎస్పీ కె.ముళీధర్‌రావు(రిటైర్డు ఎస్పీ)కు నక్సలైట్లు కాల్చిన బు ల్లెట్‌ పొ ట్టలోంచి దూసుకెళ్లింది. డీఎస్పీకి తూటా గా యం కావడంతో పోలీ సులు హైరానా పడా రు. ఆఫీసర్‌ను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జనశక్తి నేతలు రణధీర్, జగ న్‌ వెనుక వైపు దారి నుంచి మక్కచేనులో పడిత ప్పించుకున్నారు. ఆ ఇంటిలో నలుగురు సాయుధులు.. మరో ముగ్గురు నూకలమర్రి గ్రామస్తులు చిక్కుకున్నారు.

గంటన్నరపాటు హోరాహోరీ కాల్పులు
నక్సలైట్ల కాల్పుల్లో అప్పటి సిరిసిల్ల డీఎస్పీ మురళీధర్‌రావు గాయపడడంతో పోలీసులు ఇంటిని చుట్టుముట్టి తుటాల వర్షం కురిపించారు. గంటన్నరపాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అప్పటికే మీడియా అక్కడికి చేరింది. పోలీసులు వారిని దూరం నుంచే కట్టడి చేశారు. అప్పటి వేములవా డ సీఐ రామయ్య లోపల ఎంత మంది ఉన్నారు అంటూ న క్సలైట్లను ప్రశ్నించాడు. లక్ష మందిమి ఉన్నామంటూ సాయుధుడు అశోక్‌ ఇంట్లో నుంచి సవాల్‌ విసిరాడు. సమీపంలోనే ఉన్న మీ డియా ప్రతినిధులకు ఆ మా టలు వినిపించాయి. పోలీ సులు నక్సలైట్ల మధ్య మా టల తూటాలు పేలాయి.

సజీవ దహనాలు.. కాల్చివేతలు
రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తుంపర వానలోనే ఆ ఇంటి నుంచి ఓ ముగ్గురు(స్థానికులు) బయటకు రాగా.. పోలీసుల తూటాలకు బలయ్యారు. మరో నలుగురు నక్సలైట్లు ఇంటిలోనే ఉండి ప్రతిఘటిస్తుంటే.. పోలీసులు ఆ ఇంటి పైకప్పు నుంచి పెట్రో ల్‌ పోసి నిప్పు అంటించారు. నలుగురు నక్సలైట్లు అశోక్, చైతన్య, జ్యోతి, మల్లేశం సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో సాయుధులైన వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన అశోక్, చందుర్తి మండలం సనుగులకు చెందిన చైతన్య, ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌కు చెందిన జ్యోతి, జగిత్యాల జిల్లా మే డిపల్లి మండలం మోత్కురావుపేటకు చెందిన మల్లేశం ప్రాణా లు కోల్పోయారు. నక్సలైట్లను కలి సేందు కు వెళ్లిన నూకలమర్రికి చెంది న గసికంటి పర్శరాములు(25), సముద్రాల ఎల్లేందర్‌(24), దొంతుల రమేశ్‌(26) పోలీసుల కాల్పుల్లో మరణించారు.

‘జనశక్తి’ నిజనిర్ధారణతో వైరుద్యాలు
ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనపై జనశక్తి రాష్ట్ర నాయకులు, పౌరహక్కుల నేతలు నిజనిర్ధారణకు సంఘటన స్థలికి వచ్చారు. కాల్పులు జరిగిన ఆ ఇంటిని పరి శీలించారు. ఇవి పోలీసుల ఏకపక్ష కాల్పులని, ప్ర భుత్వ హత్యలని జనశక్తి రాష్ట్ర నాయకులు, పౌరహక్కుల నేతలు ఖండించారు. ఈ వార్తలు పత్రికల్లో వ చ్చాయి. పత్రికల్లో వచ్చిన వార్తను అడవుల్లో ఉన్న అప్పటి పీపుల్‌వార్‌ (ఇప్పటి మావోయిస్టులు),  జ నశక్తి నక్సలైట్ల చూశారు.

ఈ అంశంపై వారి మధ్య వాదనలు జరిగాయి. ఆయు«ధాలు పట్టి ప్రాణాలకు తెగించి మీరు అడవుల్లో పోరాడుతుంటే.. మీ అధినాయకులు మాత్రం స్వేచ్ఛగా నూకలమర్రికి వచ్చి అమరుల మరణాలపై నిజనిర్ధారణ చేస్తున్నారా ! అంటూ పీపుల్స్‌వార్‌ నాయకురాలు పద్మక్క చ ర్చకు పెట్టారు. జనశక్తి సాయుధ దళంలో పీపుల్స్‌వార్‌ వాదన చర్చకు దారితీసింది. జనశక్తిలో వైరుధ్యాలకు కారణమైంది. ఆ తరువాత 2002లో 46 మంది సాయుధ జనశక్తి పార్టీ నక్సలైట్ల లొంగుబాటుకు కారణమైంది. ఈ కాలక్రమంలో జనశక్తి పార్టీ ఉనికి కోల్పోయింది.

ఇల్లు విడిచిన దేవయ్య.. పక్షంలో ఇన్‌ఫార్మర్‌ హత్య
ఎన్‌కౌంటర్‌ జరిగిన ఇంటి యజమాని పొట్ల దేవయ్య ఆ ఇల్లు విడిచిపెట్టి కొడిమ్యాలకు వలస వెళ్లాడు. ఆ ఇల్లు శిథిలమైంది. ఈ ఎన్‌కౌంటర్‌కు బాధ్యుడిని చేస్తూ అదే వాడకట్టుకు చెందిన మేడుదుల రాజయ్యను నెల రోజుల తర్వాత ఎన్‌కౌంటర్‌ మృతుల సమాధి వద్దకు తీసుకెళ్లి విచారించి బస్టాండు వద్దకు తెచ్చి హతమార్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement