పెద్ద పులి వేటకు రంగం సిద్ధం

22 Years Old Dies After Tiger Attack In Asifabad District - Sakshi

సాక్షి, అదిలాబాద్‌ : ఉమ్మడి జిల్లాలో పెద్ద పులుల దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా అసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం పెద్ద వాగు సమీపంలో దిగిడ గ్రామానికి చెందిన సిడాం విఘ్నేష్‌(22) అనే ఆదివాసీ యువకుడిపై పెద్ద పులి దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విఘ్నేష్‌ను నోట కరుచుకున్న పులి అడవిలోకి లాక్కెళ్లింది. పులి దాడిలో గిరిజన యువకుడు విఘ్నేష్‌ మృతి చెందగా మరో ఇద్దరు 12లోపు పిల్లలు నవీన్‌, శ్రీకాంత్‌ పులి నుంచి దూరంగా పరుగులు తీసి ప్రాణాలను దక్కించుకున్నారు. అనంతరం జిల్లా అటవీశాఖ అధికారి శాంతారాం, కాగజ్‌నగర్‌ డీఎఫ్‌వో విజయ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దివిడ గ్రామాన్ని నేడు ఎస్పీ సత్యనారాయణ సందర్శించారు. మరోవైపు పెద్ద పులిని అదుపులోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో నేడు పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేయనున్నారు. చదవండి: పులి దాడిలో యువకుడి మృతి

ఇదిలా ఉండగా పెద్ద పులి దాడిలో మరణించిన విఘ్నేశ్ కుటుంబానికి ప్రభుత్వం 15లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు హరీష్ రావు డిమాండ్ చేశారు.  దిగిడాలో పెద్ద పులి దాడిలో మరణించిన విఘ్నేష్ కుటుంబాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరామర్శించారు.  కాగా ఇప్పటి వరకు అదిలాబాద్‌లోని పలు మండలాల్లో గొర్రెలు, మేకలు వంటి పశువులపై పెద్ద పులు దాడి చేశాయి గానీ.. ఇప్పటి వరకు మనుషులపై దాడి చేసిన ఘటనలు అరుదు.  అయితే మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రాణహిత నది దాడి పులులు వస్తుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

కాగా మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా తడోబా అందేరీ అభయారణ్యంలో 160 పులులు ఉండగా.. ఈ ఏడాది పులుల దాడిలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. తరుచూ పులులు దాడి చేస్తున్న క్రమంలో 50 పులులను ఇతర ప్రాంతాల్లోకి తరలించేందుకు మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తడొబా అభయారణ్యంలో ఆవాసాలు ఇరుకుగా మారడంతో తెలంగాణలోకి పులు అడుగు పెడుతున్నట్టు సమాచారం. తెలంగాణలోని కవ్వాల్ టైగర్ జోన్ విస్తరించి ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ అటవీ ప్రాంతాలు, ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాలు, బెల్లంపల్లి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల ప్రాంతాల్లో సైతం పులుల సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. గూడెం గ్రామానికి మహారాష్ట్ర బార్డర్ ఒకటే కిలోమీటర్ దూరంలో ఉండగా, ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతం బార్డర్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాజాగా గిరిజన యువకుని మృతితో గిరిజనులు జనాల భయాందోళనకు గురవుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top