రివైండ్‌‌ 2020: పరిశోధన ఆగలేదు!

2020 Year Ender Development In Science And Technology Special Story - Sakshi

2020లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చెప్పుకోదగ్గ ప్రగతి 

2020 సంవత్సరానికి నేటితో తెరపడనుంది.. కరోనా.. క్వారంటైన్‌.. భౌతిక దూరం.. మాస్క్‌.. వ్యాక్సిన్‌.. ఈ మాటలతోనే ఏడాది మొత్తం గడచిపోయింది.. మహమ్మారి కారణంగా ప్రపంచం స్తంభించిపోయిన మాట నిజమే అయినప్పటికీ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ప్రగతి మాత్రం ఆగలేదు.. 2020లో మన శాస్త్రవేత్తలు సాధించిందేమిటో ఒక్కసారి చూద్దామా..  – సాక్షి, హైదరాబాద్‌ 

1 రికార్డు సమయంలోవ్యాక్సిన్‌! 
మానవ చరిత్రలో అత్యంత వేగంగా ఓ వ్యాధికి టీకాను అభివృద్ధి చేయడం ఈ సంవత్సరమే నమోదైంది. కరోనా వ్యాధి నివారణకు ప్రపంచం నలుమూలల్లోని శాస్త్రవేత్తల బృందాలు టీకా తయారీని ప్రారంభించాయి. టీకా అభివృద్ధిలో కీలకమైన మూడు దశల మానవ ప్రయోగాలను పూర్తి చేసుకుని అత్యవసర వినియోగానికైనా వ్యాక్సిన్‌ సిద్ధమవడం ఈ ఏటి మేటి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విజయంగా చెప్పుకోవచ్చు. 

2 ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌లు! 
దశాబ్దాలుగా మనం ప్రకృతిలో పోగేసిన ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని వెదజల్లుతూనే ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఈ ఏడాది యూనివర్సిటీ ఆఫ్‌ పోర్ట్స్‌మౌత్, ఇతర వర్సిటీల శాస్త్రవేత్తలు కలసికట్టుగా ఓ సూపర్‌ ఎంజైమ్‌ను అభివృద్ధి చేశారు. జపాన్‌లో కొన్నేళ్ల క్రితం ప్లాస్టిక్‌ను తినేసే బ్యాక్టీరియా ఒకదాన్ని గుర్తించగా దాని ఎంజైమ్‌కు మరోదాన్ని కలపడం ద్వారా సూపర్‌ ఎంజైమ్‌ తయారైంది. ప్లాస్టిక్‌ బాటిళ్లను ఈ ఎంజైమ్‌ కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రాథమిక రసాయనాలుగా విడదీయగలదు. వీటితో మళ్లీ మనకు అవసరమైన ప్లాస్టిక్‌ బాటిళ్లను తయారు చేసుకునే వీలుంది. (చదవండి: 2020.. కలలు కల్లలు)

3  అందరి చూపు.. మళ్లీ జాబిల్లి వైపు.. 

చంద్రుడిపై నీరున్న విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ మరోసారి నిరూపించింది. చంద్రయాన్‌ ద్వారా నీటి ఉనికి గతంలోనే స్పష్టమైనప్పటికీ ఉపరితలంపై కూడా నీరుందని ప్రకటించడం తాజా విశేషం.. అయితే ఇక్కడున్న నీరు అతి తక్కువ. నాసా ప్రయోగించిన సోఫియా అనే అంతరిక్ష శోధక వ్యవస్థ చంద్రుడి దక్షిణార్థ గోళంలోని అతిపెద్ద లోయ ‘క్లావియస్‌ క్రేటర్‌’ఉపరితలంలోని మట్టిలో నీటి అణువులు నిక్షిప్తమై ఉన్నట్లు గుర్తించింది. ఈ క్లావియస్‌ క్రేటర్‌ను భూమ్మీద నుంచి కూడా చూడవచ్చు.. 

4  అంతరిక్షంలో ముల్లంగి పంట.. 
నాసా తొలిసారి విజయవంతంగా అంతరిక్షంలో వ్యవసాయాన్ని చేపట్టి పూర్తి చేసింది. కేట్‌ రూబిల్స్‌ అనే వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని అడ్వాన్స్‌డ్‌ ప్లాంట్‌ హాబిటాట్‌లో 20 ముల్లంగి మొక్కలను పెంచగలిగారు. వచ్చే ఏడాది భూమ్మీదకు రానున్న కేట్‌ రూబిన్స్‌ ద్వారా ఈ అపురూపమైన అంతరిక్ష ముల్లంగిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

5 వైఫై, సిగ్నళ్లు లేని చోటా ఇంటర్నెట్‌! 
ఎంతటి కఠిన పరిస్థితులున్నా ప్రపంచంలోని ప్రతి మూలకూ ఇంటర్నెట్‌ అందుబాటులోకి తెచ్చేందుకు టెస్లా కార్ల కంపెనీ యజమాని ఈలాన్‌ మస్క్‌ శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది మొదలుపెట్టి రానున్న కొన్ని దశాబ్దాల్లో అంతరిక్షంలోకి సుమారు 42 వేల ఉపగ్రహాలను పంపేందుకు ఉద్దేశించిన స్టార్‌ లింక్‌ ప్రాజెక్టు కొన్ని నెలల క్రితమే మొదలైంది. వైఫై లేని చోట, సిగ్నళ్లు అందని చోట కూడా ఈ ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్‌ అందుతుంది. (చదవండి: ఒక వైరస్‌... ఒక 36...)

6  కృత్రిమ మేధ పదునెక్కుతోంది! 

కృత్రిమ మేధతో సాధ్యమయ్యే అద్భుతాల్లో కొన్ని ఈ ఏడాది ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ‘కృత్రిమ మేధతో మానవాళికి ప్రమాదం’అన్న వ్యాఖ్యను తిప్పికొడుతూ 500 పదాల వ్యాసం రాయమని జీపీటీ–3 అనే పేరున్న న్యూరల్‌ నెట్‌వర్క్‌కి పురమాయిస్తే.. అది ఏకంగా 12 వ్యాసాలు రాసేసింది. కృత్రిమ మేధ మానవ వికాసానికి ఎలా ఉపయోగపడుతుందో వేర్వేరు ఉపమానాలు, ఉదాహరణలతో అది వర్ణించడం విశేషం.. అలాగే ఈ ఏడాది వ్యాధుల చికిత్స అవసరమైన కొత్త రసాయన మూలకాలను గుర్తించడంలోనూ కృత్రిమ మేధ అక్కరకొస్తోంది. 

 7  క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో ముందుకు.. 
ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ 2020లో ఇంకో అడుగు దగ్గరైంది. సైకమోర్‌ క్వాంటమ్‌ ప్రాసెసర్‌ ద్వారా తాము సాధారణ కంప్యూటర్‌ కంటే ఎంతో మెరుగ్గా పనిచేసే క్వాంటమ్‌ కంప్యూటర్‌ ఇప్పటికే సిద్ధం చేశామని గూగుల్‌ ప్రకటించింది. సాధారణ కంప్యూటర్లు పది వేల సంవత్సరాల్లో పూర్తి చేయగల పనిని ఈ కంప్యూటర్‌ కేవలం మూడు నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేయడం విశేషం.   

8  వయసు తగ్గించే వైద్యం! 

నిత్య యవ్వనమన్న మనిషి ఆశ ఇప్పట్లో నెరవేరే అవకాశం దాదాపుగా లేకపోయినప్పటికీ 2020లో వృద్ధాప్య సమస్యలను తగ్గించగలిగే కొత్త మందులు మాత్రం ఆవిష్కృతమయ్యాయి. రక్తపోటుకు ఉపయోగించే ఓ మందు కణాల శక్తి కేంద్రాలైన మైటోకాండ్రియా పనితీరును నియంత్రించి వయసు పెరగకుండా చేస్తూంటే.. వయసుతో పాటు వచ్చే మెదడు సంబంధిత సమస్యలను చక్కదిద్దేందుకు ఇంకో మందును కంపెనీలు సిద్ధం చేశాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top