2020.. కలలు కల్లలు

Sakshi Special Story Roundup Telangana 2020

కొత్త సంవత్సరం.. కొత్త దశాబ్దిలోకి అడుగిడుతున్న సంబరం.. ఎన్నో కలలు, ఆశలు, ఆశయాలతో ఈ ఏడాదికి ప్రపంచం మొత్తం స్వాగతం పలికింది. కానీ అనూహ్యంగా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇచ్చింది. ‘నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు’ అంటూ ప్రపంచాన్ని ఓ ఆటాడుకుంది. ముఖ్యంగా కోవిడ్‌తో ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. ప్రపంచదేశాలన్నీ చిగురుటాకులా వణికిపోయాయి. వ్యక్తులు, రంగాలు, వ్యవస్థలు ఇలా ఒక్కటేమిటి.. ఒక్కరేమిటి ప్రతి ఒక్కరూ 2020 సంవత్సరానికి, కరోనా దెబ్బకు బాధితులే.. చాలా మందికి ఈ సంవత్సరం చాలా పాఠాలు నేర్పింది. ఈ ఏడది తెలంగాణ రాష్ట్రంలో 2020లో జరిగిన అనూహ్య పరిణామాలు ఏంటి? ఇక్కడి వ్యవస్థలు ఎలా మారాయి.. ఏయే రంగాలు ఎలా ఇబ్బంది పడ్డాయి.. ఎవరు హీరోలు అయ్యారు.. అనే విషయాలపై ఓ రౌండప్‌. -సాక్షి, హైదరాబాద్‌

అవిశ్రాంత పోరాట యోధులు..
వైద్యులు, వైద్య సిబ్బంది ఈ ఏడాది హీరోలుగా నిలి చారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఆ వైరస్‌ సోకిన వారందరికీ చికిత్స అందిస్తూ వచ్చారు. ప్రపంచం మొత్తం ఈ మహమ్మారికి గజగజ వణికిపోతుంటే.. వైద్యులు మాత్రం ధైర్యంగా అన్నీ తామై వైరస్‌ సోకిన వారికి సపర్యలు చేశారు. చాలా మంది డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అదే వైరస్‌కు బలయ్యారు కూడా. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సేవలందిస్తూ మన రాష్ట్రంలో దాదాపు 3,500 మందికి కరోనా సోకగా, అందులో దాదాపు 40 మంది చనిపోయినట్లు సమాచారం. ఈ ఏడాది మొత్తం అన్ని ఆస్పత్రుల్లో కూడా కరోనా తప్ప వేరే వైద్య సేవలు చాలా తక్కు వగా అందాయి. కరోనా కారణంగా ప్రభుత్వాస్ప త్రుల్లో సదుపాయాలు పెరిగాయి. ఇదిలావుంటే కరోనా కారణంగా మెడికల్‌ కాలేజీలు తెరవకపోవ డంతో వైద్య విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకే పరిమితమయ్యారు.

అసలైన వారియర్స్‌..
ఈ ఏడాది పోలీసులు యుద్ధవీరులయ్యారు. ప్రజలందరినీ తమ ప్రాణాలు పణంగా పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కరీంనగర్‌లో కరోనా ఆనవాళ్లు కన్పించిన రోజు నుంచి నేడు బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త వైరస్‌ సోకిన వారిని గుర్తించడంలో ఎనలేకి కృషి చేశారు. లాక్‌డౌన్‌ విధించాక ఎవరూ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. వైరస్‌ నియంత్రణలో, లాక్‌డౌన్‌ అమలులో పోలీసు శాఖ పోషించిన పాత్ర ప్రశంసనీయం. అలాంటిది నిర్విఘ్నంగా సాగుతున్న ఈ యజ్ఞంలో పోలీసులూ సవాళ్లు ఎదుర్కొన్నారు. పోలీస్‌ శాఖలో దాదాపు 5,700 మంది కరోనా బారినపడ్డారు. 50కి పైగా పోలీసులు అమరులయ్యారు.

స్కూళ్లు తెరుచుకునేదెలా?
రాష్ట్రంలో విద్యా రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపింది. 2020 మార్చి 16 నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఇంటర్‌ ఫలి తాల్లో ఆలస్యం, పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు తెరుచుకోలేదు. దీంతో సెప్టెంబర్‌ 1 నుంచి పాఠశా లలు, ఇంటర్‌లో ఆన్‌లైన్‌ బోధన ప్రారంభిం చాల్సి వచ్చింది. మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థల్లో టీచర్లు, అధ్యాపకులు ఇతర సిబ్బంది రోడ్డున పడ్డారు. ప్రవేశ పరీక్షల నిర్వహణ కూడా చాలా ఆలస్య మైంది. కాగా, ఈ పరిస్థితుల్లోనూ విద్యా ర్థులకు ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2020– 21 విద్యాసంవత్సరంలో కొత్త కోర్సులు తీసు కొచ్చింది. ఇంజనీరింగ్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్, డేటాసైన్స్, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ తదితర కోర్సులకు అనుమతి ఇవ్వగా, డిగ్రీలో బీఎస్సీ డేటా సైన్స్, బీకాం బిజినెస్‌ అనలిటిక్స్, బీకాం టాక్సేషన్, బీకాం ఫారిన్‌ ట్రేడ్, బీఏ మ్యాథమెటిక్స్‌ వంటి కొత్త కోర్సులకు ఓకే చెప్పింది. అన్ని గ్రూపుల విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమ య్యేలా చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సీబీసీఎస్‌)లో మార్పులు తీసుకొచ్చింది. మార్కెట్‌ అవసరాలకు ఉపయోగపడేలా ఎం.ఫార్మసీ లోనూ 4 కొత్త కోర్సులకు అనుమతి ఇచ్చింది.

వెనుకబడిన గురుకులాలు..
గురుకుల విద్యపై కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా పడింది. మార్చిలో ఇంటిబాట పట్టిన పిల్లలు తిరిగి ఇప్పటివరకు గురుకులాన్ని చూడలేదు. ఆన్‌లైన్‌ తరగతులు, వీడియో పాఠాల ద్వారా బోధన ప్రారంభించాలని గురుకుల సొసైటీలు భావించినా.. పెద్దగా ఫలితం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్‌ గురుకుల సొసైటీల పరిధిలో 960 గురుకుల విద్యా సంస్థలున్నాయి. వీటి పరిధిలో 3.85 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఎంసెట్, నీట్, క్లాట్‌ తదితర శిక్షణలిచ్చి తీర్చిదిద్దడంతో ఉత్తమ ర్యాంకులు సాధిస్తుంటారు. కానీ ప్రస్తుతం ఆన్‌లైన్‌ బోధనతో పిల్లలు కాస్త వెనుకబడినట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు.

పడకేసిన ప్రాజెక్టులు
నిర్మాణంలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. మార్చి నుంచి పనులు పుంజుకునే సమయంలోనే వైరస్‌ విస్తృతి పెరగడంతో విదేశాల నుంచి రావాల్సిన యంత్ర సామగ్రి రాకపోవడం, వలస కూలీలు స్వస్థ లాలకు వెళ్లిపోవడం తదితర కారణాలతో పనులన్నీ నిలిచి పోయాయి. సీతారామ ఎత్తిపోతల, కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల ఎత్తిపోతల పథకాల యంత్రాలు పలు దేశాల నుంచి రావాల్సి ఉంది. ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలపైనా ప్రభావం బాగానే పడింది. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి తొలి విడతగా గోదావరి బేసిన్‌లో 400, కృష్ణాబేసిన్‌లో 200 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు పూర్తి చేయాలని భావించినా కుదరలేదు. ఇసుక లభ్యత లేకపోవడం, సిమెంట్‌ ధర పెరగడంతో కాంట్రాక్టర్లకు కష్టాలు వచ్చిపడ్డాయి. 

ఇడిసిపెడితే నడిసిపోతా..
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో అందరికన్నా ఎక్కువగా బాధ అనుభవించింది వలస కార్మికులే.. లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా పనులు నిలిచిపోవడంతో ఉపాధి లేక పూటగడవడం కష్టంగా మారింది. బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలు స్తంభించిపోవడంతో దిక్కు తోచని స్థితిలో లక్షలాది వలస కూలీలు మైళ్లకు మైళ్లు నడిచి పోయారు.. కాలినడకన వెళ్తున్న ఈ ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కంటతడి పెట్టించాయి. రాష్ట్రం నుంచి దాదాపు 9.57 లక్షల మంది వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వారిలో ఇప్పటివరకు 32 శాతమే తిరిగి వచ్చినట్లు కార్మిక శాఖ అంచనా.

ఆర్టీసీకి దెబ్బ మీద దెబ్బ
నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కరోనా, లాక్‌డౌన్‌ రూపంలో రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లింది. మార్చి చివర నుంచి అన్ని బస్సులు డిపోలకే పరిమితం కాగా, మే మూడో వారంలో జిల్లా సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ చివరలో సిటీ బస్సులు పరిమిత సంఖ్యలో ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పటికీ జిల్లా సర్వీసుల ఆక్యుపెన్సీ రేషియో 66 శాతంగానే ఉంటోంది. హైదరాబాద్‌లో కనీసం 50 శాతానికి కూడా చేరుకోలేదు. లాక్‌ డౌన్‌కు పూర్వం నిత్యం రూ.13 కోట్ల మేర టికెట్ల రూపంలో వచ్చే ఆదాయం ఇప్పుడు తొమ్మిదిన్నర కోట్లను మించట్లేదు. టికెట్‌ రూపంలోనే రూ.2వేల కోట్లు నష్టపోయింది. మరో వైపు కరోనాతో దాదాపు 50 మంది ఆర్టీసీ ఉద్యోగులు చనిపోగా, 2 వేల మంది వరకు కోవిడ్‌ బారిన పడి కోలుకున్నారు.

ఆర్థిక పరిస్థితి అతలాకుతలం
కరోనా మహమ్మారితో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక తలకిందులైంది. లాక్‌డౌన్‌తో 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్నివిధాలా కలిసి రూ.52,750 కోట్లు తగ్గనుందని ఆర్థిక శాఖ తేల్చింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత తీవ్రమైంది. రాష్ట్రానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా 2019–20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఏడు నెలల కాలంలో రాష్ట్రానికి రూ.39,608 కోట్ల ఆదాయం వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌ వరకు రూ.33,704 కోట్లు మాత్రమే వచ్చాయి. 15 శాతం ఆదాయ వృద్ధి రేటుతో 2020–21లో రూ.1,15,900 కోట్ల అంచనాతో బడ్జెట్‌ రూపొందించగా, రూ.68,781 కోట్ల ఆదాయమే సమకూర నుంది. ఈ ఏడాది వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద రూ.32 వేలకు పైగా రాబడి వస్తుందని అంచనా వేస్తే, అక్టోబర్‌ నాటికి రూ.12,800 కోట్లు మాత్రమే వచ్చింది. నవంబర్, డిసెంబర్‌ నెలల్లో కలిపి మరో రూ.5 వేల కోట్లు వచ్చినా రూ.18 వేల కోట్ల వరకు మాత్రమే జీఎస్టీ వచ్చాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందనుకున్నా.. ఇప్పటివరకు రూ.2 వేల కోట్లు కూడా దాటలేదు. రూ.30 వేల కోట్లు పన్నేతర ఆదాయం రూపంలో రావాల్సి ఉండగా, రూ.2వేల కోట్లు రాలేదు. అప్పుల విషయానికొస్తే ఏప్రిల్‌లో రూ.5,700 కోట్లు, మేలో రూ.7,642 కోట్లు, జూన్‌లో రూ.4,318 కోట్లు.. ఇలా 7 నెలల కాలంలోనే రూ.27 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకోవాల్సి వచ్చింది.

పరిశ్రమలు, ఐటీ శాఖ కాస్త మెరుగు..
పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాలు కరోనా పరిస్థితుల్లో ఈ ఏడాది ఒడిదొడుకులకు లోనైనా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనలో మెరుగైన ఫలితాలు సాధించాయి. అమెజాన్‌ సంస్థ ప్రపం చంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను ప్రారంభించింది. రూ.20,670 కోట్ల పెట్టుబడులకు నిర్ణయం తీసుకుంది. బయో ఫార్మా రం గానికి ఊతమిచ్చేలా రూ.60 కోట్లతో బీ–హబ్‌ కూడా ప్రారంభమైంది. సిర్పూర్‌ పేపర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధర ణ, ముచ్చర్ల ఫార్మాసిటీ భూసేకరణ వంటి అంశాల్లో పు రోగతి కన్పించింది. సులభతర వాణిజ్య విధానంలో రా ష్ట్రం మూడో ర్యాంకు సాధించింది. కాగా, ఐటీ సంస్థల న్నీ మార్చి మొదటి వారం నుంచే లాక్‌డౌన్‌ ప్రకటించా యి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని మరింత విస్తృతం చేయ డంతో 5.5 లక్షల మంది ఉద్యోగుల్లో 90% మంది ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త నియా మకాలు నిలిచిపోవడం, స్టార్టప్‌ కంపెనీలకు నిధుల కొరత, అద్దెల తగ్గింపు, ఐటీ కంపెనీలపై ఆధారపడి పనిచేసే హౌస్‌ కీపింగ్, కేటరింగ్‌ విభాగాల్లో పనిచేసే వారి ఉపాధికి గండిపడింది

వెలవెలబోయిన పర్యాటకం
గత 9 నెలలుగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు పూర్తిగా బోసిబోయాయి. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు కరోనా పెద్ద నష్టాలే తెచ్చిపెట్టింది. మార్చి చివరి నుంచి అన్ని పర్యాటక ప్రాంతాలను మూసేశారు. జూన్‌లో హోటళ్లను, ఆగస్టులో మిగతావి తెరిచారు. పర్యాటకుల నుంచి స్పందన మాత్రం రాలేదు. ఇప్పుడిప్పుడే కాస్త జనాలు పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నారు.

మోతమోగిన విద్యుత్‌ బిల్లులు
కరోనా కష్టకాలంలో జూన్‌ నెల విద్యుత్‌ బిల్లులు అనూహ్యంగా పెరిగిపోయాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం 2020 మార్చి 22 నుంచి దాదాపు 2 నెలల పాటు లాక్‌డౌన్‌ కారణంగా స్పాట్‌ మీటర్‌ రీడింగ్‌ తీయలేకపోయారు. లాక్‌డౌన్‌ సడలించడంతో జూన్‌ నెలలో 3 నెలల వినియోగానికి సంబంధించిన రీడింగ్‌ ఒకేసారి తీసి, సగటు వినియోగం ఆధారంగా వేశారు. దీంతో టారీఫ్‌ శ్లాబులు మారిపోయి ఈ మార్చి, ఏప్రిల్, మే నెలల బిల్లులు భారీగా పెరిగిపోయాయి.

కాస్త ఆశావహ పరిస్థితులు..
ఈ ఏడాది విపత్కర పరిస్థితుల్లోనూ మాస్క్‌లు మొదలుకుని వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఫార్మాస్యూటికల్‌ రంగంలో ఆశించిన మేర ఎగుమతులు గణనీయంగా వృద్ధి చెందడం మంచి పరిణామం. ఎన్‌–95/ఎఫ్‌ఎఫ్‌పీ–2 మాస్క్‌ల ఎగుమతులు మెరుగు పడ్డాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 23% పెరిగాయి. 110 దేశాలకు రూ.554 కోట్ల విలువైన డైరీ ప్రొడక్టులను ఎగుమతి చేశారు. కార్పెట్లు, ఆహార ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, హెల్త్, వెల్‌నెస్, దుస్తులు తదితరాల ఎగుమతులు భారీగా జరిగాయి. జెమ్‌ అండ్‌ జ్యువెలరీ రంగానికి సంబంధించి రూ.1.6 లక్షల కోట్ల ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని అంచనా. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top