కాళేశ్వరంలో 2 కొత్త కంట్రోల్‌ రూమ్స్‌! 

2 New Control Rooms In Kaleshwaram - Sakshi

అన్నారం, మేడిగడ్డ పంపుహౌజ్‌లకు భవిష్యత్తులోనూ ముంపు ముప్పు 

నష్ట నివారణలో భాగంగా వీటికి కొత్త కంట్రోల్‌ రూమ్స్‌ 

గరిష్ట వరద మట్టం కంటే 6మీటర్ల ఎత్తులో వీటి నిర్మాణం.. వేసవిలో పనులు ప్రారంభించే యోచనలో ప్రభుత్వం 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌లు ఇటీవల గోదావరి వరదల్లో నీటమునిగిన నేపథ్యంలో వీటికి శాశ్వ త పరిష్కారం చూపే అంశంపై రాష్ట్ర ప్రభు త్వం దృష్టిసారించింది. భవిష్యత్తులో గోదావరికి భారీ వరదలొస్తే మళ్లీ ఈ పంప్‌హౌజ్‌లు నీటమునిగే చాన్స్‌ ఉండడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా వీటికి సంబంధించిన కంట్రోల్‌ రూమ్స్‌ను ఎత్తైన ప్రాంతంలో కొత్తగా నిర్మించాలని నిర్ణయించింది. 

కనీసం 6 మీటర్లు ఎత్తు పెంచి... 
అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌ల లోపలే వీటికి సంబంధించిన కంట్రోల్‌ రూమ్స్‌ నిర్మించారు. పంప్‌హౌజ్‌ల సర్వీస్‌బే ఎత్తు తక్కువగా ఉండడంతో వరదల్లో పంప్‌హౌజ్‌లలోని మోటార్లతో పాటు కంట్రోల్‌ రూమ్స్‌ నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. అన్నారం పంప్‌హౌజ్‌ను 128 మీటర్ల ఎత్తులో నిర్మించగా, 129.2 మీటర్ల వరకు వరద వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన కంట్రోల్‌రూమ్‌ను 134 మీటర్ల ఎత్తులో నిర్మించాలని భావిస్తున్నారు.

మేడిగడ్డ పంప్‌హౌజ్‌ను 108 మీటర్ల ఎత్తులో నిర్మించగా, 108.2 మీటర్ల వరకు వరద వచ్చింది. దీంతో మేడిగడ్డ పంప్‌హౌజ్‌ కంట్రోల్‌రూమ్‌ను 112 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. ఇటీవలి గరిష్ట వరదమట్టంతో పోల్చితే కనీసం 6 మీటర్ల ఎత్తులో వీటి నిర్మాణం జరగనుంది. రెండు అంతస్తులతో కంట్రోల్‌ రూమ్స్‌ను నిర్మించనున్నట్టు అధికారవర్గా లు తెలిపాయి.

భారీ పరిమాణం ఉండే కంట్రోల్‌ ప్యానెల్స్, స్టార్టర్‌ ప్యానెల్స్, ఆగ్జిలరీ బోర్డ్స్‌ వంటి అత్యంత ఖరీదైన ఎలక్ట్రానిక్‌ పరికరాలు కంట్రోల్‌ రూమ్స్‌లో ఉంటాయి. వరదల్లో నీట మునిగితే మళ్లీ పనికి రావు. వరదల్లో మునిగిన ప్రతిసారి రూ.వందల కోట్లు వెచ్చించి విదేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పదు. ఈ నేపథ్యంలో ఎత్తైన సురక్షిత ప్రాంతంలో కంట్రోల్‌ రూమ్స్‌ నిర్మిస్తేనే భవిష్యత్తులో వచ్చే వరదలతో నష్టాన్ని నివారించడం సాధ్యం కానుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జరుగుతున్న అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌ల పునరుద్ధరణ పను లు పూర్తైన తర్వాత కొత్త కంట్రోల్‌ రూమ్స్‌ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. వేసవిలో పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి. 

మోటార్లను ఆరబెట్టి వాడుకోవాల్సిందే 
భవిష్యత్తు వరదల నుంచి అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌లకు రక్షణ కల్పించడం సాధ్యం కాదన్న అభిప్రాయానికి నీటిపారుదల శాఖ వచ్చినట్టు తెలిసింది. పంప్‌హౌజ్‌లు నీట మునిగిన ప్రతిసారీ అందులోని మోటార్లను ఆరబెట్టి మళ్లీ కొంత కాలానికి వాడుకోవాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు. పంప్‌హౌజ్‌లకు వరద రక్షణ గోడలు/కరకట్టలు నిర్మించడం అందులో పనిచేసే ఇంజనీర్లు, సిబ్బందికి సురక్షితం కాదన్న చర్చ జరుగుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top