Hyderabad: చెత్తను శుభ్రం చేస్తుండగా శబ్ధం.. తీరా చూస్తే 14 అడుగుల కొండచిలువ 

14 Feet Long Python Found Near Secunderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం కాలనీ పార్కులో మంగళవారం ఉదయం భారీ కొండ చిలువ కనబడింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన స్థానికులు స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందజేయడంతో వాళ్లు వచ్చి కొండ చిలువను తీసుకెళ్లారు. వివరాలు.. సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయం వెనుక వైపు ఉన్న రైల్వే కాలనీ పార్కులో మంగళవారం ఉదయం 11.45 గంటల సమయంలో పార్కులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేసేందుకు సిబ్బంది వచ్చారు.

పార్కులో ఉన్న చెత్తను ఎత్తివేస్తున్న సమయంలో అందులో ఏవో కదలికలు కనిపించాయి. మెళ్లిగా చెత్తను తొలగించి చూడగా 14 ఫీట్ల భారీ కొండ చిలువ కనబడడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. కాలనీ వారి సహాయంతో స్నేక్‌ క్యాచర్‌ బృందానికి సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న బృందం వెంటనే ఆ కొండ చిలువను పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

నిత్యం పిల్లలు, పెద్దలు పార్కులో వాకింగ్‌కు, కాలాక్షేపానికి వస్తుంటారని, ఇప్పటివరకు ఎవరికీ ఎటువంటి అపాయం జరగకపోవడం అదృష్టంగా భావిస్తున్నామని కాలనీ వాసులు చెప్పారు. ఇప్పటి నుంచి ఎప్పటికప్పుడు కాలనీ పార్కులో చెత్తచెదారాన్ని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.  
చదవండి: మహిళపై పెంపుడు కుక్క దాడి.. యజమానికి షాకిచ్చిన కోర్టు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top