కూసుమంచిలో 13వ శతాబ్దపు శివాలయం

సాక్షి, హైదరాబాద్: మరుగునపడిన కాకతీయుల కాలం నాటి శివాలయం ఒకటి ఇటీవల వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా కూసుమంచి పంచాయితీ కార్యాలయం వెనకవైపు ఉన్న ఈ ఆలయాన్ని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ, చరిత్ర పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, టార్చ్ సంస్థ అధ్యక్షుడు కట్టా శ్రీనివాస్ సర్పంచ్ చెన్న మోహన్, ఉపాధ్యాయులు అరవపల్లి వీరస్వామి, మామిళ్లపల్లి లక్ష్మిల సహకారంతో గుర్తించారు.
క్రీ.శ.13వ శతాబ్దంలో నిర్మించిన ఈ శివాలయ నిర్మాణ శైలిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని, గణపేశ్వరాలయ వాస్తు శిల్పా న్ని పోలి ఉందని శివనాగిరెడ్డి తెలిపారు. ద్వారాల ముందు రాతి కిటికీలతోపాటు గోడపైభాగంలో ఆలయం చుట్టూ రాతి వెంటిలేటర్ ఉండటం విశేషమన్నారు. 16 స్తంభాల రంగమండపం పైకప్పు, గర్భాలయంపై ఇటుక రాతి విమానం, ద్వార మం డపం ముందు నెమలి వాహనంపై వల్లీ సుబ్రహ్మ ణ్య నల్లరాతి శిల్పం అద్భుతంగా ఉన్నాయన్నారు.