తల మీద గన్ను పెడితేగానీ పనిచేయరా?

Telangana: High Court Fire On APP Recruitment  - Sakshi

ఏపీపీల నియామకాల్లో జాప్యంపై హైకోర్టు ఫైర్‌

హోంశాఖ నిద్రలో ఉందా.. న్యాయవ్యవస్థా నిద్రపోవాలని భావిస్తోందా

‘హోం’కార్యదర్శికి అర్థమయ్యేలా చెప్పాలంటూ జీపీకి ఆదేశం

నియామకాలు ఎప్పటిలోగా చేపడతారో రెండు వారాల్లో చెప్పండి

సాక్షి, హైదరాబాద్‌: అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) నియామకాల్లో తీవ్ర జాప్యంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. హోంశాఖ అధికారులు తల మీద గన్ను పెడితేగానీ పనిచేయరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టంను బలోపేతం చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదా అని అసహనం వ్యక్తం చేసింది. ‘హోంశాఖ గాఢనిద్రలో ఉందా.. న్యాయవ్యవస్థ కూడా నిద్రపోవాలని భావిస్తోందా.. ఏపీపీ నియామకాలను పూర్తి చేయాలని లేకుంటే, కేసుకు తగిన ముగింపు ఇస్తాం’అని హెచ్చరించింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శికి ఏ భాషలో చెబితే అర్థమవుతుందో అదేభాషలో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. 174 ఏపీపీల నియామకాలు పూర్తి చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో రెండువారాల్లో చెప్పాలని, లేకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాను ధర్మాసనం హెచ్చరించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో ఏపీపీల పోస్టులను భర్తీ చేయడం లేదని, దీంతో క్రిమినల్‌ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాసిన లేఖను ధర్మాసనం 2018లో సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం బుధవారం మరోసారి విచారింఇచింది. ఏపీపీల నియామకాలు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టం చేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని గత ఏప్రిల్‌ 1న ధర్మాసనం ఆదేశించినా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ హోంశాఖ తరఫున హాజరైన ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. అఫిడవిట్‌ దాఖలు చేయనందుకు క్షమించాలని, మరికొంత సమయం ఇస్తే పూర్తి వివరాలు సమర్పిస్తామని శ్రీకాంత్‌రెడ్డి నివేదించగా ‘మీ క్షమాపణలు ఎవరికి కావాలి ? ఏపీపీల నియామకం ద్వారా మాకేమైనా లబ్ధి జరుగుతుందా? క్రిమినల్‌ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందే అవకాశం ఉంటుంది’ అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

డీవోపీ నియామకానికి మూడేళ్లు..
‘‘ప్రాసిక్యూషన్‌ విభాగం పూర్తికాలం డైరెక్టర్‌ నియామకానికి మూడేళ్ల సమయం తీసుకున్నారు. 414 ఏపీపీల నియామకాల్లో 200 భర్తీ చేశామని గత విచారణ సందర్భంగా చెప్పారు. ఇటీవల భర్తీ చేసిన 40 పోస్టులు పోను మిగిలిన నియామకాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని ఆదేశించి దాదాపు రెండున్నర నెలలు గడిచినా అఫిడవిట్‌ దాఖలుకు ఇంకా సమయం కోరుతున్నారు. కోర్టుల్లో ఏపీపీలు లేకపోవడంతో క్రిమినల్‌ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నియామక ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టం చేస్తూ రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని, లేకపోతే తదుపరి విచారణకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ విచారణను జూలై 7కు వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top