న్యూస్‌రీల్
సీఎం విజయ్ కీలక ఆదేశాలు
33 శాతం పైగా పంట నష్టానికి పరిహారం
పశువుల మేతకు రూ.13.26 కోట్లు విడుదల
100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇద్దరు మాజీ మంత్రులకు సత్కారం
సాక్షి, చైన్నె: వర్షాభావ పరిస్థితుల కారణంగా తమిళనాడులో కరువు బారిన పడిన రైతులను తక్షణమే ఆదుకోవాలని సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 33 శాతానికి పైగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే పంట నష్టం సర్వేలు చేపట్టి అర్హులైన రైతులందరికీ నిబంధనల ప్రకారం సత్వరమే పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల పరిస్థితి, 2027 వేసవిలో తాగునీరు, పశుగ్రాసం అవసరాలపై సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ 2026 నుంచి నవంబర్ 25 వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, 22 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉందని అధికారులు వివరించారు. రిజర్వాయర్లలో 32.9 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉండగా, 73 శాతం చెరువుల్లో నీరు సగానికంటే తక్కువకు పడిపోయిందని తెలియజేశారు. సాగు విస్తీర్ణం కూడా గతేడాదితో పోలిస్తే 18.4 శాతం తగ్గిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
పశువుల మేతకు రూ.13.26 కోట్లు
2027 ఫిబ్రవరి నుంచి జూన్ వరకు పశువులకు మేత కొరత రాకుండా రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి రూ.13.26 కోట్లు కేటాయించారు. మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా పశుగ్రాస బ్యాంకుల ఏర్పాటు, సైలేజ్ ఉత్పత్తి యూనిట్లు, ఎండుగడ్డి నిల్వలతో పాటు రాయితీ ధరలకు పశుగ్రాసాన్ని పంపిణీ చేయనున్నారు. తీసుకున్న నిర్ణయాలను ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు ఎన్.ఆనంద్, ఆదవ్ అర్జున, కె.ఎ.సెంగోట్టయ్యన్, వి.గాంధీరాజ్, ఆర్.వినోద్, మరియావిల్సన్, ఎస్.కమాలి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం.సాయికుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గ్రామీణ రహదారులకు మహర్దశ
తమిళనాడులోని గ్రామీణ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా సీఎం సి.జోసెఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ రోడ్ల అభివృద్ధి విభాగం కింద రూ.1,037.70 కోట్ల అంచనా వ్యయంతో 797.13 కిలోమీటర్ల పొడవున్న 340 గ్రామ పంచాయతీ, పంచాయతీ యూనియన్ రోడ్లను ఇతర జిల్లా రహదారుల స్థాయికి ఆధునీకరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న రహదారుల స్థితిగతులు, స్థానిక అవసరాలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని ఈ 340 రహదారులను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
కరువు రైతులకు భరోసా
సమీక్షలో సీఎం విజయ్ కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. 33 శాతానికి మించి పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో తక్షణమే అంచనా పనులు పూర్తి చేసి, రైతులకు ఆర్థిక సాయం అందజేయాలన్నారు. అర్హులైన ప్రతి రైతుకూ పంటల బీమా ప్రయోజనం అందేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గడువులోగా రైతులందరినీ బీమా పరిధిలోకి తెచ్చేలా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు. లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో మంత్రులు, ఉన్నతాధికారుల బృందం పర్యటించి పంట నష్టం, తాగునీటి అవసరాలను స్వయంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు. వచ్చే వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పురపాలక, గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖలు సమన్వయంతో జిల్లా వారీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు.
వందేళ్లు పూర్తి చేసుకున్న తమిళనాడు మాజీ మంత్రులు వి.వి.స్వామినాథన్, పద్మశ్రీ డాక్టర్ హెచ్.వి.హండేను సీఎం విజయ్ ఘనంగా సత్కరించారు. శాసనసభ ప్రజాస్వామ్యానికి, రాష్ట్ర రాజకీయ, సామాజిక అభివృద్ధికి వారు అందించిన విశేష సేవలను స్మరించుకుంటూ శుక్రవారం చైన్నె సచివాలయంలో స్పీకర్ జె.సి.డి.ప్రభాకర్ అధ్యక్షతన ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం విజయ్ మాజీ మంత్రులు వి.వి.స్వామినాథన్, డాక్టర్ హెచ్.వి.హండేకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఇద్దరు కురువృద్ధుల పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సంతకం చేసిన రూ.100 నోటును వి.వి. స్వామినాథన్ సీఎం విజయ్‌కు బహూకరించారు. కాగా, వి.వి.స్వామినాథన్ 1972 నుంచి 1980 వరకు రాజ్యసభ సభ్యుడిగా, 1980, 1984 ఎన్నికల్లో భువనగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంజీఆర్ మంత్రివర్గంలో ఎకై ్సజ్, చేనేత, సమాచార, పర్యాటక, విద్యుత్ సహా 13 కీలక శాఖలకు మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు. డాక్టర్ హెచ్.వి. హండే ఐదుసార్లు చట్టసభలకు ఎన్నికయ్యారు. 1980–86 మధ్య ఎంజీఆర్ మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పోలియో నిర్మూలన, టీకాలు, కుష్టు నియంత్రణ రంగాల్లో విశేష కృషి చేశారు. ఈ సేవలకు గాను ప్రతిష్టాత్మక డాక్టర్ బి.సి.రాయ్ అవార్డుతో పాటు, 2026లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కంబ రామాయణాన్ని ఆంగ్లంలోకి అనువదించి సాహిత్య రంగంలోనూ తన ముద్ర వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం.సాయికుమార్, అసెంబ్లీ కార్యదర్శి శాంతి, ఉన్నతాధికారులు, మాజీ మంత్రుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


