2 స్థానాల ఉప ఎన్నికకు పచ్చ జెండా | - | Sakshi
Sakshi News home page

2 స్థానాల ఉప ఎన్నికకు పచ్చ జెండా

Nov 28 2026 12:32 AM | Updated on Nov 28 2026 12:32 AM

హైకోర్టు తీర్పు

అంబాసముద్రం, పెరుందురై స్థానాలకు తొలగిన అడ్డంకి

తిరుచ్చి తూర్పు సహా 3 స్థానాలకు కొనసాగనున్న ఆంక్షలు

సాక్షి, చైన్నె: తమిళనాడులో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల అంశంపై మద్రాసు హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. అంబాసముద్రం, పెరుందురై నియోజకవర్గాలకు మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది. తిరుచ్చి తూర్పు, కరూర్‌, విరాలిమలై నియోజకవర్గాలపై ఉన్న ఆంక్షలను యధాతథంగా కొనసాగించింది. ఆ మూడు చోట్ల ఎన్నికల పిటిషన్ల విచారణ ముగిసిన తర్వాతే ఉప ఎన్నికలు నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.ధర్మాధికారి, జస్టిస్‌ జి.అరుళ్మురుగంతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం విజయ్‌ పెరంబూర్‌, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం నిబంధనల మేరకు ఆయన తిరుచ్చి తూర్పు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరోవైపు అన్నాడీఎంకే తరఫున గెలిచిన మధురాంతకం (మరగతం కుమారవేల్‌), ధారాపురం (సత్యభామ), కరూర్‌ (ఎం.ఆర్‌.విజయభాస్కర్‌), విరాలిమలై (సి.విజయభాస్కర్‌), అంబాసముద్రం (ఇసక్కి సుబ్బయ్య), పెరుందురై (ఎస్‌.జయకుమార్‌) ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. వీరంతా అధికార టీవీకేలో చేరారు. ఇందులో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మరగతం కుమర వేల్‌, సత్యభామ మళ్లీగెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు.

హైకోర్టులో ఎన్నికల పిటిషన్లు– స్టే:

ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో విజేతల ఎన్నికను సవాలు చేస్తూ ప్రత్యర్థులు, ఓటర్లు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తిరుచ్చి తూర్పులో సీఎం విజయ్‌ విజయాన్ని సవాలు చేస్తూ డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కరూర్‌లో: ఎం.ఆర్‌.విజయభాస్కర్‌ గెలుపుపై టీవీకే అభ్యర్థి వి.పి.మది అళగన్‌, విరాళిమలైలో సి.విజయభాస్కర్‌ విజయాన్ని సవాలు చేస్తూ డీఎంకే అభ్యర్థి చెల్లపాండియన్‌ కేసులు వేశారు. ఇక, పెరుందురైలో ఎస్‌.జయకుమార్‌ ఎన్నికపై డీఎంకే అభ్యర్థి తోప్పు వెంకటాచలం, అంబాసముద్రంలో ఇసక్కి సుబ్బయ్య గెలుపును సవాలు చేస్తూ గాంధీమతినాథన్‌ అనే ఓటరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల కేసులు పెండింగ్‌లో ఉన్నందున ఉప ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధించాలని కోరుతూ తిరునల్వేలికి చెందిన వెంకటాచలపతి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు జూలై 10న ఆ ఐదు స్థానాలకు ఉప ఎన్నికల ప్రకటనపై మధ్యంతర నిషేధం విధించింది.

తాజా ఉత్తర్వులు

తమ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ సీఎం విజయ్‌తో పాటు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, అంబాసముద్రం, పెరుందురై స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు పచ్చజెండా ఊపింది. మిగిలిన మూడు నియోజకవర్గాల విషయంలో కోర్టు కేసులు తేలిన తర్వాతే ముందుకు వెళ్లాలని ఆదేశించింది.

సీఎం విజయ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

పెరంబూర్‌ నియోజకవర్గం నుంచి తన విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను కొట్టివేయాలన్న సీఎం విజయ్‌ అభ్యర్థనను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్‌ వి.లక్ష్మీనారాయణన్‌ బెంచ్‌ శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయ్‌ 53,715 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయన ఎన్నిక చెల్లదంటూ అదే నియోజకవర్గానికి చెందిన ఓటరు దినేష్‌ మద్రాసు హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ ప్రాథమిక దశలోనే కొట్టివేయాలని కోరుతూ సీఎం విజయ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన అనంతరం అక్టోబర్‌ 14న తీర్పును రిజర్వ్‌ చేసిన జస్టిస్‌ వి.లక్ష్మీనారాయణన్‌ తాజాగా విజయ్‌ పిటిషన్‌ను తిరస్కరించారు. విచారణ సందర్భంగా ఓటరు దినేష్‌ తరఫు న్యాయవాదులు ప్రధానంగా బన్రూట్టిలో రూ.30 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన వివరాలను విజయ్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించలేదని తెలిపారు. కొడైకెనాల్‌లోని విల్పట్టి గ్రామంలో కొనుగోలు చేసినట్లు పేర్కొన్న 50 సెంట్ల భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ మిగులు భూమి అని వాదించారు. నామినేషన్‌ పత్రాల్లో క్రిమినల్‌ కేసులను దాచిపెట్టడం ఎంతటి నేరమో, ఆస్తుల వివరాలను గోప్యంగా ఉంచడం కూడా అవినీతి చర్య కిందకే వస్తుందని పేర్కొన్నారు. ఇది ఓటర్ల స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందని, దీనిపై ఎన్నికల పిటిషన్‌ ద్వారానే లోతైన విచారణ సాధ్యమవుతుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement