బుల్లెట్‌ వేగం షురూ! | - | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ వేగం షురూ!

Nov 28 2026 12:32 AM | Updated on Nov 28 2026 12:32 AM

● కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ ● రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ వేగవంతానికి ఆదేశం

సాక్షి, చైన్నె: దేశ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు పూర్తయితే చైన్నె నుంచి బెంగళూరుకు 73 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. ఇది విమాన ప్రయాణం కంటే వేగవంతంగా ఉంటుందన్నారు. చైన్నెలోని టి.నగర్‌లో శుక్రవారం తమిళనాడు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చైన్నె, బెంగళూరు మధ్య రైలు ప్రయాణానికి 5 నుంచి 7 గంటలు పడుతోందని, బుల్లెట్‌ రైలు అందుబాటులోకి వస్తే అది 73 నిమిషాలకు తగ్గుతుందని వివరించారు. అదేవిధంగా, ప్రస్తుతం 8 నుంచి 12 గంటల సమయం తీసుకుంటున్న చైన్నె–హైదరాబాద్‌ ప్రయాణం, బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు ద్వారా 3 గంటల్లోనే పూర్తవుతుందని తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో భారత ఇంజినీర్లు బుల్లెట్‌ రైళ్లను అభివృద్ధి చేసే పనుల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

భూసేకరణలో జాప్యంపై ఆందోళన

తమిళనాడులో రైల్వే అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు. యూపీఏ హయాంలో తమిళనాడు రైల్వేలకు ఏటా రూ.870 కోట్లు మాత్రమే కేటాయించగా, మోదీ ప్రభుత్వంలో అది రూ.7,600 కోట్లకు పెరిగిందన్నారు. రాష్ట్రంలో రూ.48 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం లభించగా, 77 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామన్నారు. ప్రాజెక్టులకు అవసరమైన 4,800 హెక్టార్ల భూమిలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1,253 హెక్టార్లు మాత్రమే సేకరించి అప్పగించిందని, భూసేకరణను వేగవంతం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.

కల్లూరు స్టేషన్‌ పునరుద్ధరణకు హామీ

కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు బీజేపీ నేత నైనార్‌ నాగేంద్రన్‌ మాట్లాడుతూ తిరునల్వేలి–అంబాసముద్రం మార్గంలో ఏళ్లుగా మూతపడి ఉన్న కల్లూరు రైల్వే స్టేషన్‌ను తిరిగి తెరవాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ వేదికపై నుంచే రైల్వే బోర్డు చైర్మన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. కల్లూరు స్టేషన్‌ను 100 రోజుల్లోగా తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించడంతో సభలో ఉన్న నాయకులు, కార్యకర్తలు హర్షధ్వానాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement