సుప్రీం కోర్టు స్పష్టంతో తిరుప్పరకుండ్రంలో ఉత్కంఠ
నేడు వెలిగేనా
ఆలయ ట్రస్టీల బోర్డు సస్పెన్షన్
సీఆర్‌పీఎఫ్ గుప్పెట్లోకి కొండ భద్రత
సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు
సాక్షి, చైన్నె : మదురై జిల్లా తిరుప్పరకుండ్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కొండపై కార్తీక దీపం రోజున దీపం వెలిగించాలన్న వివాదం దశాబ్దాల కాలంగా నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో గత వారం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన కార్తీక దీపం రోజున కొండపై ఉన్న దీప స్తంభంలో దీపం వెలిగించాల్సిందేనని ఇచ్చిన ఆదేశాలను అధికారులు విస్మరించారు. దీంతో దీపం వివాదానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్లు సుప్రీం కోర్టుకు చేరాయి. వీటిపై శుక్రవారం జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం.పంచోలితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర యంత్రాంగం తీరుపై నిప్పులు చెరిగిన ధర్మాసనం, కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
నేడు దీప ప్రజ్వలన
ఆలయ అధికారులతో సంప్రదించి ఈ నెల 28న దీప స్తంభం వద్ద దీపం వెలిగించాల్సిందేనని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కొండపై ఉన్న దర్గాకు 50 మీటర్ల దూరంలో భక్తులు కూడా దీపాలు వెలిగించుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. స్థానిక పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షించడంలో విఫలమైనందున, ఆలయం, దర్గా పరిసర ప్రాంతాల భద్రతా బాధ్యతలను తక్షణమే సీఆర్‌పీఎఫ్ అధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది. దర్గాకు వెళ్లే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది.
ఉత్కంఠ
కోర్టు ఆదేశాల నేపథ్యంలో మదురైలోనే కాకుండా రాష్ట్రంలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మదురై పరిసరాలను నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. సీఆర్‌పీఎఫ్ సైతం రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ ఆదేశాల మేరకు శనివారం దీపం వెలిగించాల్సిందేనని బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్‌తో పాటు, హిందూ సంఘాలు పట్టుబడుతున్నాయి. దీపం వెలిగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. న్యాయ నిపుణులతో ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు విస్తృతం చేశారు.
తిరుప్పరకుండ్రం కొండ, సుప్రీం కోర్టు
నవంబర్ 24న కార్తీక దీపోత్సవం రోజున అక్కడి స్తంభం వద్ద దీపం వెలిగించాలని తాము ఇచ్చిన ఆదేశాల అమలులో విఫలమైన జిల్లా కలెక్టర్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ ధర్మకర్తల మండలి అనుమతి ఇవ్వకపోవడం వల్లే దీపం వెలిగించలేకపోయామని మదురై కలెక్టర్ సమర్పించిన నివేదికపై న్యాయమూర్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ నివేదిక మొసలి కన్నీరు కార్చే ప్రయత్నమని, అధికారుల తీరు రాష్ట్రంలో పాలనాపరమైన అస్తవ్యస్తతకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. తాము జారీ చేసిన ఉత్తర్వులపై అధికారులు బేరసారాలు ఆడటానికి వీల్లేదని, న్యాయస్థానం అధికారాన్ని నీరుగార్చే ఎలాంటి ప్రయత్నాలనూ సహించబోమని హెచ్చరించింది. మరోవైపు, దర్గా ప్రవేశ ద్వారం వద్ద కేంద్ర పురావస్తు శాఖ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకురాగా, దీనిని బరితెగించిన కోర్టు ధిక్కారంగా న్యాయస్థానం పరిగణించింది.
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం కార్తీక దీపం వెలిగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం రాష్ట్రంలో ఉత్కంఠను రేపింది. ఇది వరకు తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడంపై తమిళనాడు ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ ట్రస్టీని సస్పెండ్ చేసింది. కొండ భద్రతను సీఆర్‌పీఎఫ్‌కు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసింది.
ఆలయ బోర్డు సస్పెన్షన్
తిరుప్పరకుండ్రం ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్ చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఆలయ పరిపాలనా బాధ్యతలను రిసీవర్లుగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.వైద్యనాథన్, జస్టిస్ వి.పార్థిబన్‌కు అప్పగించింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినందుకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, దేవాదాయ శాఖ కార్యదర్శి, కమిషనర్, మదురై జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆలయ కార్యనిర్వహణాధికారి, ట్రస్టీలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. వీరందరూ డిసెంబర్ 15న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది.


