నిషేధానికి హైకోర్టు నిరాకరణ ప్రైవేట్ బస్సు యజమాని వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు పిటిషన్‌ను స్వయంగా ఉపసంహరించుకున్న పిటిషనర్ బస్సులలో ప్రయాణానికి మార్గదర్శకాలు
సాక్షి, చైన్నె: తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెట్రి పయనం పథకంపై నిషేధం విధించేందుకు మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. వివరాలు.. మహిళలు, విద్యార్థినులు,వృద్ధులు ప్రయోజనం పొందేలా తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోడ్‌కు చెందిన ప్రైవేట్ బస్సు యజమాని కళామణి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ప్రైవేట్ బస్సు యజమానులకు తీవ్రమైన ఆదాయ నష్టం కలుగుతోందన్నారు.ప్రభుత్వం ప్రైవేట్ బస్సులకు కూడా ఇదే విధంగా నష్టపరిహారం చెల్లించాలి లేదా ఈ పథకాన్ని ప్రైవేట్ బస్సులకు కూడా వర్తింపజేయాలని కోరారు.అలాగే సరైన ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే ఈ పథకాన్ని అమలు చేస్తున్నార ని పిటిషనర్ తన వాదనలో పేర్కొన్నారు. ఈ పథకంపై మధ్యంతర నిషేధం విధించాలని కోరారు.
కోర్టు కీలక వ్యాఖ్యలు.. పిటిషన్ కొట్టివేత
ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. ధర్మాధికారి, జస్టిస్ జి. అరుళ్మురుగన్‌ల ధర్మాసనం విచారించింది. న్యాయమూర్తులు స్పందిస్తూ. తమిళనాడు అంతటా అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని కేవలం ఒక జిల్లాలోని ప్రైవేట్ రవాణా సంఘం కోరినంత మాత్రాన నిషేధించలేమన్నారు. అక్టోబర్ 2నే ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయని, ఒకవేళ సమస్య ఉంటే పిటిషనర్ తన సొంత జిల్లా పరిధిలో మాత్రమే సవాల్ చేసే హక్కు ఉందే గానీ, రాష్ట్రవ్యాప్త పథకాన్ని ఆపమనే హక్కు లేదని స్పష్టం చేశారు. న్యాయస్థానం నుంచి చుక్కెదురు కావడంతో.. పిటిషనర్ తరఫు న్యాయవాది తాము పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. దీంతో న్యాయమూర్తులు పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతించి, కేసును కొట్టివేశారు.
ప్రయాణానికి మార్గదర్శకాలు
తమిళనాడులో మహిళలు, బాలికలు ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 2 నుంచి అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం పకడ్బందీగా అమలయ్యేందుకు రాష్ట్ర రవాణా సంస్థ తాజాగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
● ఈ పథకం లబ్దికి ఎలాంటి ఆదాయ పరిమితి లేదు. అలాగే లబ్ధిదారుల సంఖ్యపై కూడా ఎలాంటి పరిమితులు లేవు.
● నగర బస్సులు, శివారు (సబర్బన్) బస్సులు, కొండ ప్రాంతాల బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు.
● ఈ పథకంలో చేర్చబడిన మార్గాల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. ప్రతి సేవను సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌కు అనుసంధానించి, టోల్–ఫ్రీ కార్డ్‌లను పరీక్షించి ధృ వీకరించాలి. తగినన్ని టికెటింగ్ పరికరాలను అందుబాటులో ఉంచాలి.
● డిజిటల్ రూట్ బోర్డులు ఉన్న బస్సులలో ప్రయాణ మార్గాన్ని స్పష్టంగా ప్రదర్శించాలి. డిజిటల్ బోర్డులు లేని బస్సులలో అధికారిక ప్రయాణ స్టిక్కర్‌ను విధిగా అతికించాలి.
● డ్రైవర్లు, కండక్టర్లు, ఇన్‌స్పెక్టర్లకు ఈ పథకం విధివిధానాలు, ఉచిత టికెట్లు జారీ చేసే పద్ధతి, ప్రయాణికులతో ఎలా ప్రవర్తించాలి అనే అంశాలపై వర్క్‌షాప్ స్థాయిలో అవగాహన కల్పించాలి.
● మహిళలు లేదా ట్రాన్స్‌జెండర్ ప్రయాణికుల నుండి ఎటువంటి ఛార్జీ వసూలు చేయకూడదు. ప్రయాణించే ప్రతిసారీ ఉచిత ప్రయాణ పాస్ (జీరో టికెట్) విధిగా జారీ చేయాలి. టికెట్ జారీ చేయకపోవడం లేదా దుర్వినియోగం చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది.
● సాధారణ నగర బస్సులలో ప్రస్తుత విధానమే కొనసాగుతుంది. శివారు, పర్వత ప్రాంతాలు మరియు డీలక్స్ బస్సులలో మాత్రం ప్రయాణికులు దిగే గమ్యస్థానాన్ని కూడా ఎంట్రీ చేయాలి. ఒకవేళ మెషిన్ ఫెయిల్ అయితే, ముందుగా ముద్రించిన లేదా చేతితో రాసిన సూచనల పత్రాన్ని అందించాలి.
● అర్హులైన మహిళలకు ఎలాంటి పరిమితులు లేని టికెట్లు జారీ అయ్యాయా లేదా అని తనిఖీ అధికారులు పరిశీలించాలి. సరైన టికెట్ ఉన్న ప్రయాణికుల నుండి ఎటువంటి జరిమానా వసూలు చేయకూడదు.
● రెండు రాష్ట్రాల మధ్య నడిచే బస్సులలో ఎక్కే. ది గే ప్రదేశాలు రెండూ తమిళనాడు పరిధిలో ఉంటేనే ఉచిత ప్రయాణ టికెట్ వర్తిస్తుంది. మధ్యలో గమ్యస్థానం వేరే రాష్ట్రంలో ఉండి, మళ్లీ తమిళనాడులో దిగితే టికెట్ అవసరం లేదు. ఈ నిబంధనలన్నింటినీ కండక్టర్లు, డ్రైవర్లు రవాణా సిబ్బంది కచ్చితంగా పాటించాలని రవాణా శాఖ స్పష్టం చేసింది.


