భవిష్యత్‌ కార్యాచరణపై కీలక సూచనలు | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ కార్యాచరణపై కీలక సూచనలు

Sep 24 2026 1:42 AM | Updated on Sep 24 2026 1:42 AM

ఎల్రక్టిసిటీ బోర్డు సందర్శన

అధికారులతో సమాలోచన

సాక్షి, చైన్నె: తమిళనాడులో విద్యుత్‌ రంగాన్ని మరింత పటిష్టం చేయడానికి, వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సీఎం ఎస్‌. జోసెఫ్‌ విజయ్‌ బుధవారం చైన్నె అన్నాసాలైలోని తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి, పలు కీలక విభాగాలను తనిఖీ చేశారు. అధికారులతో సమావేశమై విద్యుత్‌ డిమాండ్‌ సరఫరాపై సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్‌ డిమాండ్‌, ఉత్పత్తి పరిస్థితులు, పునరుత్పాదక, సాంప్రదాయ వనరుల నుంచి లభిస్తున్న విద్యుత్‌ పరిమాణంపై చర్చించారు. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ ప్రభావం, బొగ్గు లభ్యతలో సవాళ్లు, గ్యాస్‌ ధరల పెరుగుదల వంటి అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. 2027 వేసవి కాలంలో తలెత్తే విద్యుత్‌ డిమాండ్‌ను ముందే అంచనా వేసి, దాన్ని అధిగమించడానికి అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.

కీలక కేంద్రాల పరిశీలన

రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పత్తి, సేకరణ, డిమాండ్‌ సరఫరాను పర్యవేక్షించే విధానాన్ని, లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ను సీఎం పరిశీలించారు. చైన్నె నగరంలో విద్యుత్‌ సరఫరా స్థితి, లోడ్‌ నిర్వహణ, లోపాలను తక్షణమే గుర్తించి సరిదిద్దే సమన్వయ చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 24 గంటల వినియోగదారుల సేవా కేంద్రంలో ప్రజల నుంచి వచ్చే విద్యుత్‌ ఫిర్యాదులు, సమస్యలను స్వీకరించి వాటిని వెంటనే సంబంధిత అధికారులకు చేరవేయడం, ఫిర్యాదుల పరిష్కార తీరును సీఎం స్వయంగా పరిశీలించారు. వోల్టేజ్‌ సమస్యలు, దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలు లేదా తీగలపై వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు.

వీఎస్‌ బాబుకు పరామర్శ

కొళత్తూరు టీవీకే ఎమ్మెల్యే వీఎస్‌ బాబు ఊపిరితిత్తుల సమస్యతో అమింజికరైలోని ఎంజీఎంలో ఈనెల 9వ తేదీ నుంచి చికిత్సలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన్ని సాయంత్రం సీఎం విజయ్‌ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యలతో మాట్లాడిన ఆయన భరోసా ఇచ్చారు.

అధికారులకు సీఎం విజయ్‌ కీలక ఆదేశాలు

పాతబడిన విద్యుత్‌ పరికరాలను మార్చడం, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, కొత్త విద్యుత్‌ లైన్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో పాటు, తమిళనాడు ప్రభుత్వం తరఫున ప్రకటించిన రూ. 1 లక్ష వరకు అదనపు సబ్సిడీ పథకాన్ని ఉపయోగించి ప్రజలు ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. విద్యుత్‌ డిమాండ్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ విధానాన్ని వేగంగా అమలు చేయాలని సూచించారు. విద్యుత్‌ కోతలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, కొత్త విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని, రాష్ట్ర సొంత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు విస్తృతంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఇంధన , న్యాయ శాఖ మంత్రి సి.టి.ఆర్‌. నిర్మల్‌ కుమార్‌, సీఎస్‌ సాయికుమార్‌, ఇంధన శాఖ కార్యదర్శి అనిల్‌ మెష్రామ్‌, విద్యుత్‌ బోర్డు చైర్మన్‌ అరుణ్‌ రాయి, ఎండీ ఎం గోవిందరావు, గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఎండీ పిఎన్‌ శ్రీథర్‌, బోర్డు ప్రతినిధులు మెర్సీ రమ్యతదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సీఎం ఓ వైపు విద్యుత్‌బోర్డు వద్ద తనిఖీలకు రాగా, మరో వైపు ఆ ప్రాంతంలో విద్యుత్‌ఉద్యోగులు ముందుగానే నిరసన దీక్ష కొనసాగిస్తుండటంతో ఆపరిసరాలలో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి నిర్మల్‌కుమార్‌మీడియాతో మాట్లాడుతూ, సీఎం విజయ్‌ తనిఖీలను ప్రస్తావిస్తూ తమిళనాడులో తక్షణమే 600 సబ్‌ స్టేషన్లు అవసరం అని, 6 వేల విద్యుత్‌ట్రాన్స్‌ ఫార్మర్లను పనురద్దురించాల్సి ఉందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement