– మద్రాసు హైకోర్టు
సాక్షి, చైన్నె : మేఘదాతు డ్యాం విషయంగా తమిళనాడు శాసనసభలో ఆమోదించిన తీర్మానంలో చేసిన సవరణను సవాల్ చేస్తూ అన్నాడీఎంకే విప్ అగ్రి కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జూన్ 19న తమిళనాడు అసెంబ్లీలో కావేరి తీరంలో కర్ణాటక నిర్మించ తలబెట్టిన డ్యాంకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అదే సమయంలో ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయనిధి ఈ సందర్భంగా ఓ సూచన చేశారు. మేఘాదాతు వ్యవహారంలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిన అవశ్యం ఉందని సూచించడంతో సవరణతో ఆ ముసాయిదాను అసెంబ్లీ ఆమోదించింది. అయితే అసెంబ్లీలో ట్రిబ్యునల్ విషయంగా చర్చించకుండానే, ఏక పక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే విప్ అగ్రి కృష్ణమూర్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సమయంలో శాసనసభ అంతర్గత కార్యకలాపాలను, సభలో జరిగిన పరిణామాలను కోర్టులో ప్రశ్నించలేమని, రాజ్యాంగం ఇందుకు అనుమ తించదని తమిళనాడు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. సభలో వీడియో ఆధారాలను కూడా న్యాయమూర్తుల ముందు ఉంచారు. ఈ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి , జె. అరుళ్‌మురుగన్ ధర్మాసనం అన్ని వాదనలను పరిశీలించి, అగ్రి కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
వర్షాల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం
– కమిషనర్ సమీరన్
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చైన్నెలో కురువబోయే భారీ వర్షాలు, వరద ముప్పును ఎదుర్కొనేందుకు చైన్నె కార్పొరేషన్ అన్ని ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేసింది. అడయార్ నదీముఖద్వారాన్ని తనిఖీ చేసిన అనంతరం కార్పొరేషన్ కమిషనర్ సమీరన్ మీడియాతో మాట్లాడారు. నగరంలో చేపట్టిన రక్షణ చర్యలు, సన్నద్ధత వివరాలను ఆయన వివరించారు. నగరవ్యాప్తంగా 215 సహాయక శిబిరాలను సిద్ధంగా ఉంచామన్నారు. భారీ వర్షాలు కురిసే సమయాల్లో ఆహారం అందించేందుకు 111 వంటశాలలతో పాటు, అమ్మ క్యాంటీన్లు, మరో 44 కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. వరద ముప్పు నుంచి ప్రజలను రక్షించేందుకు స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు చైన్నె యాప్ ద్వారా 3,500 మంది వాలంటీర్లు పేర్లు నమోదు చేసుకున్నారని వివరించారు.అలాగే, అత్యవసర సహాయక చర్యల కోసం 38 పడవలను సిద్ధంగా ఉంచామన్నారు. నగరంలో 290 లోతట్టు ప్రాంతాలను గుర్తించామని, మెట్రో రైలు పనులు జరుగుతున్న చోట్ల వర్షపు నీరు నిలవకుండా తొలగించేందుకు, కార్పొరేషన్‌కు చెందిన 67 మోటార్ పంపులతో పాటు బయటి నుంచి తెప్పించిన పంపులు సహా మొత్తం 1,320 మోటార్ పంపులను సిద్ధంగా ఉంచామని వివరించారు. ఎలాంటి వర్షాలనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఆసియా క్రీడల్లో కాంస్యం
సాక్షి, చైన్నె: ఆసియా క్రీడల్లో పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడైన తమిళనాడు క్రీడాకారుడు హరిహరన్‌ను సీఎం విజయ్ అభినందించారు. ఆయన ప్రతిభను గుర్తించి భారీ ఆర్థిక ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ కేటగిరీలో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల జట్టుకు, అలాగే ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న తమిళనాడు క్రీడాకారుడు హరిహరన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం సాయంత్రం సీఎం విజయ్ ఎక్స్ పేజిలో పోస్టు చేశారు. హరిహరన్ ప్రతిభకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం తరఫున రూ. 30 లక్షల భారీ ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. తమిళనాడు క్రీడా అభివృద్ధి సంస్థ పరిధిలోని ఎలైట్ స్పోర్ట్స్ పర్సన్ పథకంతో కింద ఆర్థిక సహాయం పొందుతున్న హరిహరన్, రాష్ట్రంలోని యువ క్రీడాకారులందరికీ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. తమిళనాడు ప్రభుత్వం ఎప్పుడూ క్రీడాకారుల కలలకు అండగా నిలుస్తుందన్నారు. హరిహరన్ భవిష్యత్తులో మరెన్నో ఘన విజయాలు సాధించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆంక్షించారు. కాగా, మంగళవారం తమిళనాడుకు చెందిన మధురై క్రికెటర్ కమలినికి రూ. 75 లక్షలు నజరానా సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.
హైకోర్టు


