సాక్షి, చైన్నె: తమిళనాడు వ్యాప్తంగా డెంగీ విజృంభిస్తోంది. మంగళవారం జరిగిపిన పరిశోధన మేరకు ఒక్క రోజులో 300కు పైగా డెంగీ కేసులు నిర్ధారణ కావడంతో కలవరం రేపుతోంది. ప్రభు త్వ ఆసుపత్రులు, ప్రైవేట్ క్లినిక్‌లలో జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఒక్కరోజే కొత్తగా వందలాది మందికి డెంగీ నిర్ధారణను ఆరోగ్య శాఖ అంగీకరించింది.
చైన్నెలో తీవ్రత ఎక్కువ..
ఇతర జిల్లాలతో పోలిస్తే చైన్నె నగరంలో డెంగీ కేసులు, మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతుండటంతో కార్పొరేషన్ , ప్రజారోగ్య శాఖ అప్రమత్తమయ్యాయి. చైన్నెలోని అడయార్, దండేశ్వరం నగర్ వంటి ప్రాంతాలలో ఇంటింటికీ సర్వే నిర్వహిస్తూ, దోమల నివారణ మందులను పిచికారీ చేస్తున్నారు. అలాగే, ఆరోగ్య శాఖ జారీ చేసిన ముఖ్యమైన మార్గదర్శకాలు జారి చేస్తున్నారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తూ, పిల్లలకు ఒకవేళ జ్వరం లేదా ఇతర లక్షణాలు ఉంటే పొరపాటున కూడా బడికి పంపవద్దని స్పష్టం చేశారు. జ్వరం, దగ్గు లక్షణాలు ఉన్నవారు, వృద్ధులు, గర్భిణిలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించడం ద్వారా ఇన్‌ఫెక్షన్ వ్యాపించకుండా కాపాడుకోవచ్చని సూచించారు. మాస్క్ ధరించడం తప్పనిసరి కానప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా మంచిదని పేర్కొన్నారు. ఇళ్ల చుట్టూ వర్షపు నీరు లేదా నిల్వ నీరు లేకుండా చూసుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తపడాలని కోరారు. అలాగే,అన్ని ఆస్పత్రులు,ఆరోగ్యకేంద్రాలలో డెంగీ ప్రత్యేకవార్డులు సిద్ధంగా ఉంచారు.


