సాక్షి, చైన్నె : ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన అన్నాడీఎంకేను తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కోలోకోలేని దెబ్బ తీశాయి. గతంలో 30 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ఈ పార్టీ, ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక మూడో స్థానానికి పడిపోయింది. కాగా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి గత ఏడాది జూలై నుండే తన బలాన్ని చాటే విధంగా ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. 170 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మేనిఫెస్టో హామీలను విడతల వారీగా ప్రకటించినా ప్రజలు ఆయనను ఆదరించలేదు. దీంతో అన్నాడీఎంకే కూటమి గెలుపు కేవలం 53 స్థానాలకే పరిమితమైంది. ఇందులో అన్నాడీఎంకే సొంతంగా 47 సీట్లు గెలుచుకుంది. కూటమిలోని బీజేపీ, పీఎంకే వంటి పార్టీలు ఆశించిన ఫలితాలను సాధించలేకపోయాయి.
ప్రతిపక్ష హోదా దూరం
2011, 2016లలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే 2021లో ప్రధాన ప్రతి పక్షం స్థానంలో కూర్చుంది. ఈసారి అది కూడా దూరం కావడం అన్నాడీఎంకే వర్గాలను తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. విజయ్ టీవీకే రూపంలో డీఎంకే అధికారాన్ని కోల్పోతే, అన్నాడీఎంకే ప్రధాన ప్రతి పక్ష స్థానం కూడా దూరం చేసుకుంది. ప్రతిపక్ష నాయకుడి హోదా కోల్పోవడంతో, ఎడప్పాడి పళనిస్వామి అడయార్‌లోని తన ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కాకుండా ఓట్ల శాతం 21.21 శాతానికి పరిమితం కావడంతో పార్టీ పరంగా ప్రక్షాళన తప్పదన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులలో బుధవారం ఎన్నికలలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ చైన్నెకు పళణి స్వామి పిలిపించారు. ఈ ఎమ్మెల్యేలతో పాటూ పార్టీ జిల్లాల కార్యదర్శులతో సమావేశానికి నిర్ణయించడం గమనార్హం.
ఓటింగ్ శాతాలు ఇలా..
ఈ ఎన్నికలలో టీవీకే 1,72,26,209 ఓట్లతో 34.92 శాతం, డీఎంకే 1,19,29,144 ఓట్లతో 24.19 శాతం,ఈ కూటమిలోని కాంగ్రెస్16,61,312 ఓట్లతో 3.37 శాతం, ఇతర పార్టీలు మరో ఆరు ఐదు శాతం మేరకు ఓట్లు దక్కించుకున్నాయి. అన్నాడీఎంకే 1,04,62,146 ఓట్లతో 21.21 శాతం, ఈ కూటమిలోని బీజేపీ 13,67,024 ఓట్లతో 2.97 శాతం ఓట్లు, ఇతర పార్టీలు మరో మూడు శాతం తగ్గించుకోవడం గమనార్హం. ఇక, ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొన్న నామ్ తమిళర్‌కట్చి నేత సీమాన్ పార్టీకి 18,72,537 ఓట్లతో 4 శాతం ఓట్లను రాబట్టుకోగలిగింది.


