సిద్ధాంతానికి ఓటమి లేదు..! | - | Sakshi
Sakshi News home page

సిద్ధాంతానికి ఓటమి లేదు..!

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

బలమైన ప్రతి పక్షంగా ఉంటాం

ప్రజల పక్షాన పోరాడుతాం

సీఎం పదవికి రాజీనామా తర్వాత స్టాలిన్‌ ట్వీట్‌

ఉద్వేగంగా కొళత్తూరులో ర్యాలీ

సాక్షి, చైన్నె: ద్రావిడ సిద్ధాంతానికి ఎన్నడూ ఓటమి అన్నది రాదని, బలమైన ప్రధాన ప్రతి పక్షంగా ఉంటామని మాజీ సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ వ్యాఖ్యలు చేశారు. ఓటమి తదుపరి పరిణామాలతో సీఎం పదవికి రాజీనామా చేసిన స్టాలిన్‌ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపే ట్వీట్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికలలలో తాను సైతం ఓటమి పాలు కావడం, కూటమిలోని కొన్ని పార్టీల సమన్వయం కొరవడటం వంటి పరిణామాలతో అధికార దూరం కావడంతో తన సీఎం పదవికి స్టాలిన్‌ మంగళవారం రాజీనామా చేశారు. ఈ లేఖను గవర్నర్‌కు పంపించారు. అనంతర, ఓటమి వలన కృంగిపోకుండా తమ పార్టీకి ఉన్న ప్రజా మద్దతును కార్యకర్తలకు వివరించి, వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నంగా ఎక్స్‌ పేజీలో స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు.

గణాంకాల విశ్లేషణ

ప్రస్తుత లెక్కల ప్రకారం డీఎంకే కూటమికి 1 కోటి 54 లక్షల 82 వేల 782 ఓట్లు వచ్చాయని ఆయన తెలిపారు. అత్యధిక స్థానాల్లో గెలిచిన పార్టీ (టీవీకే)కు తమ కంటే కేవలం 17.43 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చిందన్నారు. ఇద్దరి మధ్య ఓట్ల శాతం తేడా కేవలం 3.52శాతం మాత్రమేనని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకం ఎప్పటికీ బలంగానే ఉందని తాను భావిస్తున్నానని విశ్లేషించారు.

కార్యకర్తలకు పిలుపు

గెలిచిన అభ్యర్థులు వెంటనే ప్రజల వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలియజేయాలని ఆదేశించారు. డీఎంకే ఆరుసార్లు అధికారంలో ఉందని, తమ ప్రయాణంలో గెలుపోటములు సహజమని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. మన సిద్ధాంతం ఎప్పటికీ ఓడిపోకూడదు అంటూ అధికారంలో ఉంటే ప్రజల కోసం పథకాలు అమలు చేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల హక్కుల కోసం పోరాడుతాం అని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఒక బలమైన ప్రతిపక్షంగా నిలబడి ప్రజల కోసం రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దివంగత నేతలు పెరియార్‌, అన్నాదురై, కలైజ్ఞర్‌ కరుణానిధి చూపిన బాటలో ద్రావిడ సిద్ధాంతాలను కాపాడుతూ, భాష , దేశ రక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని, మళ్లీ విజయం సాధిస్తామని స్టాలిన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, స్టాలిన్‌ ఓటమి నేపథ్యంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతి పక్ష నేతగా డీఎంకే తరపున ఉదయ నిధిని ఎంపిక చేయడానికి కసరత్తు జరుగుతున్నట్ట సమాచారాలు వెలువడ్డాయి. ఇక, సాయంత్రం తాను ఓటమి పాలైన కొళత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్‌ ర్యాలీ నిర్వహించారు. తీవ్ర ఉద్వేగ భరితంగా ఈ ర్యాలీ జరిగింది. సీనియర్‌నేత శేఖర్‌బాబుతోపాటూ మద్దతుదారులు కన్నీటి పర్యంతమయ్యారు.

17.43 లక్షల ఓట్లే తేడా..

శాసనసభ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, ఓటమి ని హుందాగా అంగీకరించడమే కాకుండా, గణంకాల పరంగా డీఎంకే కూటమికి లభించిన ప్రజాదరణను స్టాలిన్‌ డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమికి ఓటు వేసిన తమిళ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలి పారు. ప్రజలు వేసిన ప్రతి ఓటును అమూల్యమైన నమ్మకంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement