సాక్షి, చైన్నె: అక్షయ తృతీయ సందర్భంగా సోమవారం బంగారం కొనుగోళ్లు జోరుగా జరిగాయి. ఎన్నికల తనిఖీలు ఓ వైపు సాగినా, మరో వైపు బంగారం వర్తకులకు కాసుల వర్షం కురిపించింది. జనం తరలి రావడంతో జ్యువలరీస్ కిక్కిరిశాయి.ఇక, ఆలయాలలో పూజలు, వివాహ వేడుకలు సందడి సందడిగా జరిగాయి. వివరాలు.. ప్రజల్లో బంగారం (పసిడి)పై మోజు నానాటికీ పెరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. తాజాగా సోమవారం అక్షయ తృతీయ గడియ రోజు కావడం జనం దృష్టి బంగారం కొనుగోళ్ల మీద మరింతగా పడింది. అక్షయ తృతీయ పర్వదినాన కనీసం ఒక్క గ్రాము బంగారమైనా కొనుగోలు చేసి తీరాలన్న కాంక్షతో జనం జ్యువలరీస్ వైపుగా ఉదయాన్నే ఉరకలు తీశారు. ఈ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి తమ నట్టింట్లో అడుగు పెట్టినట్టేనని ప్రజలలో నమ్మకం పెరగడంతో అక్షయ తృతీయ రోజు బంగారు విక్రయదారులకు పండుగే అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. ముఖ్యమైన రోజు కావడంతో జనం ఉదయం నుంచి బంగారు దుకాణాల బాట పట్టారు. ముందుగా ఆలయాలలో, ఇళ్లల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆయా షోరూంల వైపుగా జనం తరలి రావడంతో, ప్రత్యేక డిజైన్లతో, సరికొత్త, ఆకర్షణీయమైన కలెక్షన్లను బంగారు నగలను, ప్లాటినం ఆభరణాల్ని, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి చిత్రాలతో బంగారం, వెండి కాయిన్స్, డాలర్లను కొలువు దీర్చారు. అలాగే అనేక షోరూంలు ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో జనం పోటెత్తారు. చైన్నెతో పాటుగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలలోని బంగారం దుకాణాల్లో వ్యాపారం జోరుగానే జరిగింది. ప్రజలు బంగారం కొనుళ్లకే కాదు, ఆలయాలలో పూజలకు సైతం జనం ప్రాధాన్యతను ఇచ్చారు. అక్షయ తృతీయను ఎంతో అదృష్టం కలిసొచ్చే శుభదినం, విజయసూచకంగా భావించే ప్రజలు ఉదయాన్నే ఇంటిళ్లి పాది ఆలయాలకు వెళ్లి దేవుళ్లను దర్శించుకున్నారు. అనేక ఆలయాలలో కొత్తజంటల వివాహ సందడి మిన్నంటింది. ఇక, భూములు, గృహాల కొనుగోలు రిజిస్ట్రేషన్లు సైతం జోరుగానే జరిగాయి.


