– బీజేపీ నేత అన్నామలై
తిరువళ్లూరు: మహిళా బిల్లును అడ్డుకున్న డీఎంకేకు మహిళలే బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర మాజీ అద్యక్షుడు అన్నామలై పిలుపు నిచ్చారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అశ్విన్ అలియాస్ రాజసింహా మహేంద్రకు మద్దతుగా అన్నామలై సోమవారం ఉదయం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, అన్నాడీఎంకేతో సహా కూటమి నేతలు సమన్వయంతో పని చేసి ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఆవడిలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన తరువాత మంత్రి అయినా కూడా ఆవడి అబివృద్ధి ముందుకు సాగించడం లేదని వాపోయారు. మంత్రిగా ఆవడి నాజర్ బాధ్యతలు స్వీకరించిన తరువాత పాడిపరిశ్రమతో సహా అన్ని శాఖలను అవినీతిమ యం చేశారని ఆరోపించారు. ఆమ్‌స్ట్రాంగ్ హత్యకేసు లో కీలక నిందితుడు అరుల్, అన్నావర్శిటీలో విద్యార్ధినిపై లైంగిక దాడికి పాల్పడిన నేరస్తులకు డీఎంకే కార్యాలయం, నాజర్ ఆశ్రయం ఇచ్చారన్నారు. అలాంటి వ్యక్తులను మళ్లీ గెలింపించవద్దని ఆయన పిలుపు నిచ్చారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ఆవడి నియోజకవర్గ అబివృద్ధి కోసం ఒక్క ప్రశ్న కూడా లేవనెత్తని ఒకే శాసనసభ్యుడు నాజర్ అని, అలాంటి వ్యక్తిని ఓడించాలని ఆయన పిలుపు నిచ్చారు. ఆవడిలో బీజేపీ విజయం సాధిస్తే రోడ్డు, సబ్‌వే మురికి కాలువలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా పోలీసులు, ఎయిర్‌హోస్టెస్‌ను సైతం లైంగికంగా వేధించడం ద్వారా తమిళనాడుకు రావాలన్న వారిలో అభద్రతాభావం నెలకొందని ఆరోపించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో 20 వేల హత్యలు, 39 వేలకు పైగా లైగింక వేధింపుల కేసులు నమోదయ్యాయని ఆయన గుర్తు చేశారు. డీఎంకే కూటమిలో విభేదాలు పెరిగిందని, విజయకాంత్ ఆత్మ ప్రేమలతలో ప్రవేశించి డీఎంకే హయాంలో జరుగుతున్న అక్రమాలను ఆమె నోటితోనే చెప్పించారన్నారు. బీజేపీ కూటమికి అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.


