క్లుప్తంగా
సినీ సహాయ నటి తండ్రి హత్య
తమిళసినిమా: కొడైక్కెనాల్‌లో సినీ సహాయ నటి తండ్రి హత్యకు గురైన ఘఽటన కలకలాన్ని సృష్టించింది. వివరాలు.. నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన మాయావి చిత్రంలో నటించిన సహాయ నటి విష్ణుప్రియ. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఈమె తండ్రి సూర్యనారాయణ (73)తో కలసి దిండుగల్ జిల్లా కోడైక్కానల్ సమీపంలోని కురించి ఆండవర్ కోయిల్ ప్రాంతంలో నివశిస్తున్నారు. వీరికి అక్కడ పెద్ద బంగ్లా ఉంది. కాగా ఆ బంగ్లాలో అనుమతి లేకుండా అద్దెకు ఇస్తున్నాడు సూర్యనారాయణ. కాగా ఆ బంగ్లాలో ఆరుముగం,మురళి అనే ఇద్దరు పని చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత రెండు రోజుల క్రితం విహార యాత్రకు వచ్చిన ఐదుగురు వ్యక్తులు ఆ బంగ్లాలో బసకు దిగారు. శనివారం రాత్రి ఆ గుర్తు తెలియని వక్తులు ఆ బంగ్లా వద్దకు వచ్చి పనిమనుషులు ఆరుముగం, మురళిని చితక బాదారు. అనంతరం సూర్యనారాయణను ముఖం అంతా టేప్‌లతో చుట్టి దారుణంగా హింసించారు. దీంతో ఆయన ఊపిరి ఆడక మృతిచెందాడు. ఆ దుండగులు సూర్యనారాయణ మెడలోని బంగారు గొలుసు, ఉంగరం, సీసీ టీవీల హార్డు డిస్క్‌లు తీసుకుని పరారయ్యారు. కాగా సహా నటి విష్ణుప్రియ ప్రేమికుడు గత 2018లో హత్యకు గురి అయ్యారు. దీంతో అతని హత్యకు సూర్యనారాయణ హత్యకు ఏమైనా సంబంధం ఉందా ? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
సముద్రంలో మునిగి యువతి మృతి
– మరొకరు గల్లంతు
అన్నానగర్: సముద్రంలో మునిగి ఓ యువతి మృతిచెందగా, మరొక యువకుడు గల్లంతయ్యాడు. షోలింగనల్లూర్‌లోని ఒక ఐటీ కంపెనీలో మయూరి (25), జై(25) పనిచేస్తున్నారు. వీరు, సహచర ఉద్యోగులతో కలసి శనివారం సాయంత్రం చైన్నెలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని పనయూర్ కుప్పం, కానత్తూర్ సమీపంలోని బీచ్‌కు వెళ్లారు. మయూరి, జై సముద్రంలోకి వెళ్లారు. ఆసమయంలో వచ్చిన ఒక పెద్ద అల వారిద్దరిని సముద్రంలోకి ఈడ్చు కెళ్లింది. అక్కడ ఉన్న వారు వెంటనే మయూరి ని ఒడ్డుకు తీసుకొచ్చారు. జై సముద్రంలో గల్లంతయ్యాడు. అతన్ని రక్షించే ప్రయత్నాలు విఫలమయ్యాయి. మయూరిని ఆస్పత్రికి తర లిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. జై కోసం ఆదివారం కూడా గాలిస్తున్నారు. కానత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నాటు తుపాకులు స్వాధీనం
వేలూరు: ఆంబూరులో అక్రమంగా పెట్టుకున్న నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీసు కేసు నమోదు చేస్తున్నారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు తాలుకా కాంబల్లి ప్రాంతంలో అనుమతి లేకుండా అటవీ జంతువులను వేటాడేందుకు అక్రమంగా నాటు తుపాకులు తయారు చేస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో అకస్మికంగా తనిఖీలు చేయగా అనుమతి లేకుండా తయా రు చేసిన మూడు నాటు తుపాకులు, తుపాకులు తయారు చేయడానికి ఉంచిన కర్ర, ఎయిర్‌గన్, అటవీ జంతువులను వేటాడేందుకు ఉంచిన 14 నాటు బాంబులు ఉన్నట్లు గుర్తించారు. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకొని కాంబల్లి గ్రామానికి చెందిన సత్యనాధన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే విధంగా నాటు తుపాకులను తయారు చేసి ఎవరికి విక్రయం చేశారు. నాటు బాంబులు అటవీ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పెట్టారు, వీటిలో ఎంత మంది ఉన్నారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
బైక్ ఢీకొని ఉద్యోగి మృతి
అన్నానగర్: బైక్ ఢీకొని ఓ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి మృతిచెందాడు. కరూర్ జిల్లాలోని సెనప్పీరట్టి గ్రామానికి చెందిన శక్తివేల్ కుమారుడు లోకేష్‌కుమార్ (24). ఇతను సెంజీలోని ఒక ప్రైవేట్ బ్యాంకులో క్యాషియర్. ఇతనికి మార్చి 5న వివాహం నిశ్చయమైంది. లోకేష్ కుమార్ పెళ్లికి సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈక్రమంలో ఆదివారం కరూర్ వెళ్లడానికి బైక్‌లో సెంజికి బయలుదేరాడు. విక్రవాండి లక్ష్మీపురం సమీపంలో సెంజీ–విల్లుపురం రోడ్డులో వెళుతుండగా బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకేష్‌కుమార్‌ను స్థానికులు అతన్ని వెంటనే ముండియంబాక్కంలోని విల్లుపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే లోకేష్‌కుమార్ మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు ఢీకొని ఇద్దరి మృతి
తిరుత్తణి: బైక్‌ను, ప్రైవేట్ కంపెనీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన తిరుత్తణి సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. తిరుత్తణి సమీపంలో చైన్నె–తిరుపతి జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో పొన్పాడి వద్ద నగరి వైపు వెళుతున్న ప్రైవేటు కంపెనీ బస్సు, నగరి నుంచి తిరుత్తణి వైపు వెళుతున్న బైకు నేరుగా ఢీకొంది. ఈఘటనలో బైకులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలిసి తిరుత్తణి పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో మృతులు అరక్కోణం సమీపంలోని ఇళ్లప్పన్ తండలం గ్రామానికి చెందిన విజయ్(22), అరికల్‌పాడికి చెందిన యువకేశ్(22) అని తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్లుప్తంగా


