విజయవంతంగా వైబ్రెన్స్–26
కొరుక్కుపేట: వీఐటీ చైన్నెలో వైబ్రెన్స్–2026 పేరుతో నాలుగు రోజులపాటు నిర్వహిస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కతిక ఉత్సవం విజయవంతంగా ముగిసింది. వీఐటీ– చైన్నెలో వార్షిక అంతర్జాతీయ మెగా సాంస్కృతిక ఉత్సవం వైబ్రాన్‌న్స్–26 నాలుగు రోజులపాటు నిర్వహించారు. శనివారం జరిగిన ముగింపు ఉత్సవాలలో నటి డాక్టర్ శ్రీలీల పాల్గొన్నారు. వీఐటీ వ్యవస్థాపక చాన్స్‌లర్ డాక్టర్ జి. విశ్వనాథన్, ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.వి.సెల్వం సమక్షంలో కార్యక్రమం సాగింది. శ్రీలీల మాట్లాడుతూ విద్యార్థులు తమ అభిరుచులను కొనసాగించాలని, అలాగే తమ తల్లిదండ్రులను రోల్ మోడల్‌గా పరిగణించాలని ప్రోత్సహించారు. కళాశాల జీవితం భవిష్యత్తును రూపొందించే కీలకమైన దశ అని ఆమె చెప్పారు. విద్యా విషయాలను, సినిమాను సమతుల్యం చేసుకోవడంపై ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ శ్రీలీల క్రమశిక్షణ, సమయ నిర్వహణ ప్రాముఖ్యతను చెప్పి ఆకట్టుకున్నారు. డాక్టర్ జి.విశ్వనాథన్ మాట్లాడుతూ విద్యార్థులు తమ చదువులో బాగా రాణించాలని, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరారు. వైబ్రాన్‌న్స్ 2026లో చైన్నెలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఓవరాల్ కల్చరల్ చాంపిపిన్ షిప్ ట్రోఫీని గెలుచుకుని ముగింపు వేడుకలో ట్రోఫీని అందుకుంది. వీఐటీ చైన్నె ప్రొ–వైస్ చాన్స్‌లర్ డాక్టర్ టి.త్యాగరాజన్, వీఐటీ చైన్నె డైరెక్టర్ డాక్టర్ కె.సత్యనారాయణన్, అదనపు రిజిస్ట్రార్ డాక్టర్ పీకే మనోహరన్ పాల్గొన్నారు.
దివ్యాంగులకు ట్రై స్కూటర్ల పంపిణీ
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా అర్హులైన 338 మంది దివ్యాంగులకు ట్రైస్కూటర్లను రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్ ఆదివారం పంపిణీ చేశారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా అర్హులైన దివ్యాంగులకు ట్రై స్కూటర్లు, స్వయం ఉపాధి కోసం రుణాలు, బ్యాటరీ వాహనాలు పంపిణీ చేసే కార్యక్రమం ఆదివారం జరిగింది. కార్యక్రమానికి కలెక్టర్ ప్రతాప్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మంత్రి నాజర్ హాజరై రూ.1.40 కోట్ల విలువైన ట్రై స్కూటర్లు, బ్యాటరీ వాహనాలను పంపిణీ చేశారు. దివ్యాంగులకు వివాహ సహాయ నిధి కింద ఒకరికి రూ.50వేల నగదు, బంగారు కాయిన్స్, మరో 60 మంది దివ్యాంగులకు స్వయం ఉపాది కోసం రూ.8.69 లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి నాజర్ మాట్లాడుతూ డీఎంకే అధికారంలోకి వచ్చిన ప్రతిసారి దివ్యాంగులు, మైనారిటీలు, సంఘటిత, అసంఘటిత కార్మికులకు, హిజ్రాలకు మేలు జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, తిరుత్తణి చంద్రన్, పొన్నేరి దురైచంద్రశేఖర్, డీడీఆర్‌ఓ కుమార్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జీఎం కౌషల్‌కుమార్, రిషబ్ పాల్గొన్నారు.
డ్రగ్స్ కేసులో ఇద్దరి అరెస్ట్
అన్నానగర్: డ్రగ్స్ కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చైన్నెలోని మదురవాయల్ సమీపంలోని బైపాస్ సర్వీస్ రోడ్డులో వానగరం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో, ఆ రోడ్డు గుండా రెండు కార్లలో వచ్చిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. వారిని వ్యాసార్పాడికి చెందిన ఇనుప వ్యాపారి దినేష్ (34), కొరట్టూరుకు చెందిన మెకానిక్ మెక్కాలన్ ట్రావర్ (43)గా గుర్తించారు. వారిద్దరు థాయిలాండ్ నుంచి కొరియర్ల ద్వారా మాదకద్రవ్యాలను కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు.
విజయవంతంగా వైబ్రెన్స్–26


