పన్నీరుకు చోటు లేదు
సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరు సెల్వంను అన్నాడీఎంకేలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి స్పష్టం చేశారు. అన్నాడీఎంకే నుంచి పన్నీరు సెల్వం, టీటీవీ దినకరన్, శశికళను బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాయబారం రూపంలో అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ ఎన్‌డీఏ కూటమిలోకి మళ్లీ చేరారు. ఆయన రాకను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ఆహ్వానించారు. ఈ ఇద్దరు తాజాగా ఒకే వేదికపైకి వచ్చారు. అయితే, మాజీ సీఎం పన్నీరు సెల్వం రాజకీయ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఆయన వెన్నంటి ఉన్న వాళ్లందరూ బయటకు వెళ్తుండటంతో దాదాపుగా ఒంటరయ్యారని చెప్పవచ్చు. అదే సమయంలో తాను అన్నాడీఎంకేలో మళ్లీ చేరి సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నట్టు పన్నీరు ప్రకటించారు. ఇందుకు సమాధానం ఇచ్చే విధంగా పళణిస్వామి గురువారం స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, పన్నీరుకు చోటు లేదని స్పష్టం చేశారు.


