ఎళ్లవేళలా కార్మికులకు డీఎంకే మద్దతు
వేలూరు: డీఎంకే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారిశుధ్య కార్మికులకు ఎల్లవేళలా మద్దతుగా ఉంటుందని పారిశుధ్య కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ తిప్పంబట్టి ఆరుస్వామి అన్నారు. వేలూరులోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో పారిశుధ్య కార్మికుల సంక్షేమ బోర్డు, వేలూరు కార్పొరేషన్ సంయుక్తంగా కార్మికులకు సంక్షేమ పథకాలు పంపిణీ కార్యక్రమం కమిషనర్ లక్ష్మణన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బోర్డు చైర్మన్ మాట్లాడుతూ తన తాత చెప్పులు కుట్టే వృత్తి చేసేవారని తన తండ్రి పంచాయతీలో తలారిగా పని చేశారని తనకు సీఎం స్టాలిన్ సంక్షేమ బోర్డు చైర్మన్‌గా నియమించారన్నారు. పారిశుధ్యం చేయడమనేది పని కాదని అది ఒక సేవగా భావించాలన్నారు. కార్మికులు వారి చేతులకు మురికి పూసుకొని అన్ని ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారన్నారు. పారిశుధ్య కార్మికులకు ఉదయం టిఫన్ పథకాన్ని డీఎంకే ప్రభుత్వంలో తీసుకొస్తే వాటిని గత పది సంవత్సరాలుగా నిలిపి వేశారన్నారు. సంవత్సరానికి రూ. 20 కోట్లు పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం కేటాయిస్తున్నారని ఇప్పటి వరకు రూ. 65 కోట్లు సంక్షేమ బోర్డు కోసం కేటాయించారన్నారు. పారిశుధ్య కార్మికులు తప్పకుండా చేతికి గ్లౌజులు, సంక్షేమ పరికరాలు ఉపయోగించి చెత్తను సేకరించాలన్నారు. అనంతరం వివిధ సంక్షేమ పథకాలను అందజేశారు. కార్యక్రమంలో మేయర్ సుజాత, తాట్కో ప్రాజెక్టు మేనేజర్ రేఖ, కార్పొరేషన్ డివిజన్ చైర్మన్ యూసఫ్‌ఖాన్, తాశీల్దార్ వడివేలు, పారిశుద్య కార్మికులు పాల్గొన్నారు.


