ఖైదీల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేయాలి
వేలూరు: జైలులోని ఖైదీల్లో మార్పు తీసుకొచ్చేందుకు జైలర్లు కృషి చేయాలని జైళ్లశాఖ డైరెక్టర్ ప్రదీప్ అన్నారు. వేలూరు సెంట్రల్ జైలు సమీపంలోని ఆఫ్‌కా శిక్షణ కేంద్రంలో తమిళనాడు, కేరళ, నాగలాండ్ రాష్ట్రాలకు చెందిన జైలు అధికారులకు జైలులో ఖైదీల పట్ల నడుచుకోవాల్సిన పద్ధతి, పరిపాలన విధానం తదితర వాటిపై శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జైలు అనేది క్షణికావేశంతో చేసే తప్పులకు సంబంధించిన స్థలం కాదని, ఖైదీల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే స్థలంగా ఉండాలన్నారు. మత్తుకు బానిసైన ఖైదీలు జైలులోను వాటిని ఉపయోగించేందుకు అవసర మైన అన్ని ప్రయత్నాలు చేస్తుంటారని, వీటికి జైలు సిబ్బంది సాయంగా ఉండరాదన్నారు. జైలు ఖైదీలకు జైలులో కనీస వసతులు ఏర్పాటు చేయాలని చట్టాలు చెబుతాయని, అయితే వారికి కొన్ని నిబంధనలున్నాయన్నారు. తమిళనాడులోని జైలు ఖైదీలచే పెట్రోల్ బంకులు, కాయకూరల మార్కెట్‌ను విక్రయించడం అభినందనీయమన్నారు. వీటి ద్వారా ఖైదీల్లో మార్పు తీసుకొచ్చేందుకు సులభతరంగా ఉంటుందన్నారు. ఖైదీలచే ఇటువంటి వ్యాపార దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా బయట విడుదలైన అనంతరం వారు నేరాలకు పాల్పడకుండా ఇటువంటి పనులు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరాజన్, బ్యూలా తదతరులు పాల్గొన్నారు.


