రౌడీ అండ్ కో చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
తమిళసినిమా: వైవిధ్యభరిత కథా చిత్రాలను నిర్మిస్తూ సక్సెస్‌ఫుల్ చిత్రాల సంస్థగా పేరు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ ఫ్యాషన్ స్టూడియోస్. ఈ సంస్థ అధినేత సుదన్ సందరం తాజాగా నిర్మిస్తున్న చిత్రం రౌడీ అండ్ కో. నటుడు సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న ఇందులో నటి రాశీఖన్నా నాయకిగా నటిస్తున్నారు. నటుడు యోగిబాబు, రెడిన్ కింగ్‌స్లీ, సునీల్ రెడ్డి,ప్రాంక్‌స్టర్ రాహుల్,వెట్టి మణి, చార్లస్ వినోద్,తనీఒరువన్ చిత్ర విలన్ వంశీ క్రిష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందు కప్పల్ అనే సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన కార్తీక్ జీ.క్రిష్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. సరికొత్త ప్రయోగాత్మక కథాంశంతో వినోదాత్మక కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోందని యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా చిత్ర టైటిల్‌తో కూడిన వీడియోను విడుదల చేశారు. ఇందులో నిజ రౌడీలతో నటుడు సిద్ధార్ధ్, యోగిబాబు చేతిలో కత్తులు పట్టుకుని నిలబడ్డ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇది చిత్రంపై మంచి అంచనాలను పెంచుతుందనే అభిప్రాయాన్ని యూనిట్ సభ్యుల వ్యక్తం చేస్తున్నారు. రౌడీ అండ్ కో చిత్రం అన్ని వర్గాల వారిని అలరించే మంచి ఎంటర్‌టైనర్ గా ఉంటుందని ఫ్యాషన్ స్టూడియోష్ సంస్థ అదినేతన సుదన్ సుందరం పేర్కొన్నారు. రేవా సంగీతాన్ని ,అరవింద్ సింగ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు.


