సేలం: ఈరోడ్ జిల్లా మొదకురిచ్చిలో ఆదివారం ఉదయం రెక్లాన్ పోటీలు వేడుకగా నిర్వహించారు. ఈరోడ్ జిల్లా మోదకురిచ్చి సమీపంలో కార్మికుల దినోత్సవం సందర్భంగా రెక్లాన్ పోటీలు నిర్వహించారు. ఇందులో గుర్రాలు, ఎద్దులు పరుగులు తీసి వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈరోడ్ జిల్లా మోదకురిచ్చి సమీపంలోని లక్కపురంలో రెక్లా అసోసియేషన్, ఈరోడ్ కంట్రీ గో ప్రొటెక్షన్ కమిటీ, ఆదివానం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో ఈరోడ్ జిల్లా నుంచే కాకుండా కరూర్, తిరుపూర్ తదితర జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో గుర్రాలు, ఎద్దులు పోటీ పడ్డాయి. ఒంటి ఎద్దు పందెం రెండు విభాగాలుగాను, గుర్రపు పందెం 8 మైళ్లు, 10 మైళ్లు, 6 మైళ్ల దూరం జరిగింది. ఈ పోటీలను అన్నాడీఎంకే మాజీ మంత్రి కేవీ రామలింగం, మాజీ శాసనసభ్యుడు వీపీ శివసుబ్రమణి ప్రారంభించారు. ఇందులో గెలుపొందిన ఒంటి ఎద్దుకు మొదటి బహుమతిగా రూ. 25,000, గుర్రానికి రూ. 30 వేలు నగదు బహుమతితో పాటు షీల్డ్‌లు అందజేశారు. ఈ పోటీలలో ఎద్దులు, గుర్రాల యజమానులతో పాటు వాటితో ఉత్సాహంగా పరుగులు తీసిన యువకులను అభినందించారు.
ఇంట్లో జారి పడ్డ వైగో
●భుజానికి గాయం
సాక్షి, చైన్నె: ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ఇంట్లో జారి పడ్డారు. ఆయన భుజానికి గాయమైంది. ఈ వివరాలను ఆయన తనయుడు, పార్టీ నేత దురై వైగో ఆదివారం ప్రకటించారు. ఆయన పేర్కొంటూ, విరుదునగర్ నివాసంలో వైగో జారి పడ్డారని, ఆయనకు గాయమైనట్టు పేర్కొన్నారు. ఈ కారణంగా ఆయన ఆదివారం ఉదయాన్నే తూత్తుకుడి నుంచి విమానంలో చైన్నెకు బయలుదేరి వెళ్లారని వివరించారు. వైద్యుల సూచన మేరకు అన్నానగర్ నివాసంలో ఉంటూ చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. పార్టీ వర్గాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవ్వరూ ఆయన్ని పరామర్శించేందుకు రావద్దని కోరారు.
నేడు బీజేపీ కార్యవర్గం భేటీ
సాక్షి, చైన్నె : బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సోమవారం చైన్నెలో భేటీ కానుంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం జరగనున్న తొలి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలో మెగా కూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా బీజేపీ వర్గాలు తీవ్రకుస్తీ పట్టాయి. బీజేపీ అధినాయకులు అందరూ రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేశారు. కూటమిపార్టీల నేతలు సైతం ఎన్నికలలో అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. వీరికి మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రులందరూ రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. ఎన్నికలు ముగిశాయి. మరో వారం రోజులలో ఫలితాలు వెలువడనున్నాయి. ఈ పరిస్థితులలో సోమవారం బీజేపీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆ పార్టీ అధ్యక్షుడు అన్నామలై పిలుపు నిచ్చారు. టీ నగర్‌లోని కమలాలయంలో సమావేశం జరగనుంది. తొలుత జిల్లాల వారీగానేతలతో, అనంతరం రాష్ట్ర నేతలతో అన్నామలై సమావేశం కానున్నారు.
జూన్‌లో కొత్త టెర్మినల్ ద్వారా సేవలు
సాక్షి, చైన్నె: తిరుచ్చిలో కొత్తగా నిర్మించిన టెర్మినల్ ద్వారా జూన్‌లో విమాన సేవలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు సంబంధించిన తుది ఏర్పాట్లు ముగిశాయి. ఈ టెర్మినల్‌ను సీఆర్‌పీఎఫ్ భద్రతా పరిధిలోకి తెచ్చారు. రాష్ట్రంలో చైన్నె తదుపరి, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న విషయం తెలిసిందే. తిరుచ్చి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే పనులు గతంలో మొదలయ్యాయి. రూ.1,112 కోట్లతో బ్రహ్మాండ టెర్మినల్ రూపుదిద్దుకుంది. తిరుచ్చి శ్రీరంగం ఆలయ గోపురాన్ని తలపించే విధంగా ప్రవేశ మార్గంలో నిర్మాణాలు జరిగాయి. అంతర్జాతీయ హంగులతో తీర్చిదిద్ద బడ్డ ఈ టెర్మినల్‌ను జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయితే లోపల కొన్ని పనులు ముగించాల్సి ఉండటంతో ఈ టెర్మినల్‌ను ఉపయోగంలోకి తీసుకు రావడంలో జాప్యం తప్పలేదు. ప్రస్తుతం లోపల అన్ని పనులూ ముగిశాయి. భద్రతా వ్యవహారాలను సీఆర్‌ఫీఎఫ్‌కు అప్పగించారు. కొత్త టెర్మినల్‌లో ప్రయాణికులకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో పాటు ఆధునిక హంగులతో తమిళ సంస్కృతి సంప్రదాయాలను చాటే ఏర్పాట్లు చేశారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఈ టెర్మినల్‌ను ఉపయోగింలోకి తెచ్చే విషయంగా చర్చించారు. ఆ విమానాశ్రయం డైరెక్టర్ సుబ్రమణి నేతృత్వంలో జరిగిన సమావేశంలో జూన్ 11 నుంచి ఈ టెర్మినల్‌ను ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. ముందుగా ఈ టెర్మినల్ వద్దకు విమాన సేవలు తదితర ప్రక్రియలకు సంబంధించిన ట్రయల్ రన్ విజయవంతం చేయడానికి చర్యలు చేపట్టారు.