రూటు మార్చిన ఓపీఎస్‌ | Sakshi
Sakshi News home page

రూటు మార్చిన ఓపీఎస్‌

Published Sat, Apr 22 2023 1:04 AM

పన్నీరుసెల్వం,               పళనిస్వామి   - Sakshi

సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే వ్యవహారంలో మాజీ సీఎం పన్నీరుసెల్వం రూటు మార్చారు. తమ పార్టీ జెండాను ఉపయోగించకూడదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వర్గం నుంచి హెచ్చరికలు రావడంతో జెండాకు కొత్త మెరుగులు దిద్దారు. ఆ పార్టీ జెండాలో రెండాకులను జోడించి ఉపయోగించేందుకు నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది.

అన్నాడీఎంకే వర్గాల అమ్మ జయలలిత మరణంతో పార్టీలో చీలిక ఏర్పడిన విషయం తెలిసిందే. టీటీవీ దినకరన్‌ నేతృత్వంలో అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ఆవిర్భవించింది. ఆ పార్టీ జెండా అన్నాడీఎంకే జెండాను పోలిన వర్ణంతో తీసు కొచ్చినా, జెండా మధ్యలో అన్నాదురై ఫొటోను తొలగించి జయలలిత ఫొటోను పొందు పరిచారు. తాజాగా పళనిస్వామి, పన్నీరుసెల్వం మధ్య వివాదాల నేపథ్యంలో మళ్లీ ఆ జెండా వివాదానికి దారి తీసింది.

జెండాలో రెండాకులు..
ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు, కోర్టు తీర్పులతో అన్నాడీఎంకే పళనిస్వామి గుప్పెట్లోకి చేరింది. దీంతో తమ పార్టీ పేరును, జెండాను ఉపయోగించకూడదని పన్నీరుసెల్వంకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఒక వేళ ఉపయోగించిన పక్షంలో చట్ట పరంగా చర్యలు తప్పవని పళనిస్వామి శిబిరం స్పష్టం చేసింది. అదే సమయంలో తిరుచ్చి వేదికగా ఈనెల 24న జరగనున్న పన్నీరు సెల్వం నేతృత్వంలోని మహానాడులో పార్టీ జెండా వినియోగం వివాదానికి దారి తీసే అవకాశాలు కనిపించాయి. దీనిని ముందుగానే పసిగట్టిన పన్నీరు శిబిరం జెండాను తమకు అనుకూలంగా మలుచుకోవడం గమనార్హం. అన్నాడీఎంకే జెండా నలుపు, ఎరుపు వర్ణాలతో ఉంటుంది. మధ్యలో దివంగత నేత అన్నాదురై ఫొటో ఉంటుంది. అయితే, ఈ జెండాను అలాగే వాడేసుకుంటూ, అన్నాదురైకు పైభాగంలో రెండాకుల చిహ్నం పన్నీరు శిబిరం పొందుపరచడం చర్చకు దారి తీసింది. పన్నీరు కొత్త పార్టీ పెట్టేనా అన్న చర్చ తెరపైకి వచ్చింది. అయితే, న్యాయపోరాటంలో తుది గెలుపు తమదే అని, అందుకే ప్రస్తుతానికి జెండాలో పార్టీ గుర్తు రెండాకుల చిహ్నంను పొందు పరిచినట్టు పన్నీరు శిబిరం నేతలు పేర్కొంటున్నారు. ఈవ్యవహారంపై పన్నీరు శిబిరం సీనియర్‌ నేత బన్రూటి రామచంద్రన్‌ పేర్కొంటూ అన్నాడీఎంకే పేరును, జెండాను, చిహ్నంను తాము వినియోగిస్తామని, ఇది తమ హక్కుగా వ్యాఖ్యలు చేశారు.

చట్టపరంగా చర్యలు...
పన్నీరు సెల్వం శిబిరం తీరుపై పళనిస్వామి తీవ్రంగా స్పందించారు. ఎన్నికల కమిషన్‌, కోర్టు స్పష్టంగా పార్టీ, జెండా, చిహ్నం తమకే చెందుతుందని చెప్పాయని, అలాంటప్పుడు ఆయన రాజకీయ నాగరికతకు అనుగుణంగా నడుచుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. పార్టీ పేరు, జెండాను ఆయన వినియోగించడం అనాగరిక చర్యగా వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం విశ్వాసంగా ఉండే వాళ్లను చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు, అయితే, ద్రోహులకు అన్నాడీఎంకేలో చోటు లేదని పరోక్షంగా పన్నీరును ఉద్దేశించి పళనిస్వామి వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే సీనియర్‌నేత జయకుమార్‌ స్పందిస్తూ, పన్నీరు తన ధోరణి మార్చుకోకుంటే చట్టపరంగా చిక్కులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పార్టీ పేరు, జెండాను ఆయన వినియోగించడంపై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయబోతున్నామన్నారు.

Advertisement
Advertisement