సూర్యాపేటటౌన్ : యువత స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని ఎస్పీ నరసింహ అన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నేటి యువత, బాలలే దేశానికి రేపటి భవిష్యత్ అన్నారు. ఇలాంటి భవితవ్యం ఉన్న యువత, విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ తీసుకున్న మైకంలో నేరాలకు పాల్పడుతూ జైలు పాలవుతున్నారని, తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను, కలలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని, వేగంగా వెళ్లవద్దన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


