కోదాడ : వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి కోరారు. గురువారం కోదాడ మండలం అల్వాలపురం, గుడిబండ రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన విత్తన మేళాలో ఆయన మాట్లాడారు. రైతులు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యాప్ ద్వారానే రైతులు యూరియా కొనుగోలు చేయాలని, డీలర్లు బ్లాక్‌లో యూరియా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఏడీఏ ప్రశాంతి, కోదాడ మండల వ్యవసాయ అధికారి రజని, విస్తరణ అధికారి నగేష్, పిచ్చయ్య, మహేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కరాటే మాస్టర్ల నుంచి
దరఖాస్తుల ఆహ్వానం
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని 24 పీఎంశ్రీ స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్న బాలికలకు స్వీయ రక్షణలో భాగంగా కరాటే, కుంగ్‌ఫూ, జూడో, ఇతర మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ కలిగిన మాస్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా క్రీడల, యువజన సర్వీసుల శాఖ అధికారి వెంకట్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా మాస్టార్ల (శిక్షకుల)కు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. శిక్షణ ఇచ్చే మాస్టార్లు వారి పూర్తి వివరాలను బయోడేటా ఫామ్‌లో పొందుపరచాలని తెలిపారు. జూలై 2వ తేదీలోగా అర్హులైన మాస్టార్లు జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని, ఇతర వివరాలకు జిల్లా యువజన, క్రీడల అధికారి సెల్ 91009 49979 నంబర్ కు సంప్రదించాలని కోరారు.
రైతు భరోసా నిధులు విడుదల చేయాలి
భానుపురి (సూర్యాపేట) : పెండింగ్‌లో ఉన్న యాసంగి రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు కంచర్ల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను నకిలీ విత్తనాల బారినుంచి రక్షించడానికి వెంటనే విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానమంత్రి తీసుకొచ్చిన కేతి బచావో ప్రోగ్రామ్‌లో భాగంగా రైతులు ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలు నష్టపోకుండా ఫసల్ బీమా యోజన పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రంగరాజు రుక్మారావు, పాండురంగ చారి, బైరెడ్డి సంజీవరెడ్డి, బొజ్జ పరశురాం, సంతోష్ నాయక్, మాలోత్ షాంకనాయక్, సత్యనారాయణ, రవి, దిలీప్ పాల్గొన్నారు.


