బుక్ చేసేలోగా నోస్టాక్!
వారం రోజులుగా తిరుగుతున్నాం
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో యూరియా తిప్పలు మొదలయ్యాయి. వానకాలం సీజన్‌లో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఫెర్టిలైజర్ యాప్‌ను తీసుకు రాగా.. రైతుల నిరక్షరాస్యత, అధికారుల తీరుతో సమస్య మళ్లీ మొదటికే వచ్చింది. సగం మంది రైతులు యూరియాను బుక్ చేసుకునేందుకు అవస్థలు పడుతుండగా.. బుక్ చేసుకునేందుకు సిద్ధమైన రైతులకు నిమిషాల్లోనే నో స్టాక్ అంటూ యాప్ వెక్కిరిస్తోంది. దాంతో యాప్‌ను రద్దు చేసి పాస్‌బుక్‌లపైనే యూరియాను అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
బుక్ చేసేందుకు తిప్పలు
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్‌లో 4.82 లక్షల ఎకరాలలో వరి సాగైంది. అందుకు గానూ 70 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కానుంది. జిల్లాలో ఇప్పటి వరకు 62 వేల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేయగా.. మరో 5,500 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. రైతులకు యూరియాను పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను అమలు చేస్తోంది. ఇప్పటికే జిల్లా రైతాంగానికి కావాల్సిన యూరియాలో 90 శాతం మేరకు అందించినట్లు అధికారులు చెబుతున్నా.. తమకు యూరియా అందడం లేదని రైతులు ఆందోళన చేయడం చూస్తుంటే అసలు యూరియా ఎటు పోతుందనే విషయం అంతు పట్టడం లేదు. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ వచ్చిన తర్వాత జిల్లాలో దాదాపు 6వేల మెట్రిక్ టన్నుల యూరియాను అందించారు. అయినా యూరియా బుకింగ్ కోసం యాప్ ఓపెన్ చేస్తే తమకు అందుబాటులోకి రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు చెప్పిన సమయానికి ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసే లోగానే నోస్టాక్‌గా దర్శనమిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాస్‌బుక్‌లతోనే ఇవ్వాలని డిమాండ్
జిల్లాలో రైతులు చాలావరకు నిరక్షరాస్యులు ఉన్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం తెలియని వారు చాలా మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో యాప్ ద్వారా యూరియా బుక్ చేయాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. తెలిసిన వారి వద్దకు వెళ్లి బుక్ చేద్దామనే సరికి స్టాక్ అయిపోతుందని వస్తుందని చెబుతున్నారు. పాస్‌బుక్‌ల ద్వారా యూరియా పంపిణీ చేస్తే రైతులకు ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.
యూరియా ఎందుకిస్తలేరని పీఏసీఎస్ అధికారులను నిలదీస్తున్న రైతులు
యాప్ రద్దు చేయాలని ఆందోళన
ఆత్మకూర్(ఎస్) : పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులతో కాకుండా ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడం కష్టంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ యాప్‌ను రద్దు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలతోనే రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యూరియా అందక పంట పొలాలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తంగెళ్ల వీరారెడ్డి, న్యూడెమోక్రసీ నాయకులు డేగల వెంకటకృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, గుణగంటి శ్రీను, మధుసూదన్‌రెడ్డి సంకలమద్ది వెంకట్‌రెడ్డి, గిలకట్టుల మల్లయ్య, బట్టిపల్లి లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఫర్టిలైజర్ యాప్‌తో రైతులకు ఇబ్బందులు
పీఏసీఎస్ సీఈఓల లాగిన్లతో
ప్రైవేటు వ్యక్తుల బుకింగ్
నిమిషాల్లోనే రైతులకు యూరియా నోస్టాక్ మెసేజ్
నేరుగా యూరియా ఇవ్వాలని ఆందోళనలు
నాకున్న ఎకరన్నరతో పాటు మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నా. యూరియా కోసం వారం రోజులుగా తిరుగుతున్నాను. యాప్‌తో బుక్ చేసేందుకు నావద్ద స్మార్ట్‌ఫోన్ లేదు. ఎవరితోనైనా బుక్ చేయిద్దామంటే నిమిషాల్లోనే అయిపోతున్నాయని చెబుతున్నారు. నెమ్మికల్, ఆత్మకూర్, ఏపూరు పీఏసీఎస్‌ల వద్దకు వెళ్లినా యూరియా దొరకడం లేదు. పాస్ బుక్ ద్వారానే యూరియా అందించాలి.
– బానోతు వెంకన్న,
కోటినాయక్‌తండా, ఆత్మకూర్ (ఎస్)
ఇప్పటి వరకు యాప్‌తో బుకింగ్ ఇలా..
రైతులు : 80,654
బుక్ చేసుకున్న బస్తాలు : 3,07,761
కొనుగోలు చేసిన బస్తాలు : 2,77,901
బుక్ చేసేలోగా నోస్టాక్!
బుక్ చేసేలోగా నోస్టాక్!


