పీఠంపై ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి, తిరుమలగిరిలో బీఆర్‌ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ వారే సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్లలో పాలకవర్గాలను ఏర్పాటు చేయనుండగా, తిరుమలగిరిలో బీఆర్‌ఎస్ పాలకవర్గం కొలువుదీరనుంది. ఇప్పటికే సూర్యాపేట చైర్మన్‌గా నివేదిత లక్ష్యాది పేరును ఖరారు చేయగా.. ఇక్కడ వైస్ చైర్మన్ ఎవరన్న చర్చ సాగుతోంది. మిగతా మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఫలితాలు వెలువడిన వెంటనే కౌన్సిలర్లను ఆయా పార్టీలు క్యాంపులకు తరలించాయి. అక్కడే చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరన్నది చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 16వ తేదీన నేరుగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సమావేశాలకు హాజరుకానున్నారు.
సూర్యాపేటలో లాంఛనమే
సూర్యాపేట మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థిగా మొరిశెట్టి నివేదిత లక్ష్యాదిని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆమె చైర్మన్ కానుండగా, వైస్ చైర్మన్ ఎవరన్నది తేలాల్సి ఉంది. క్యాంపునకు తరలివెళ్లిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో శనివారం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలోనూ వైస్ చైర్మన్ ఎవరన్న దానిపై ప్రాథమికంగా చర్చించినట్లు తెలిసింది. ఆదివారం మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక్కడ వైస్ చైర్మన్ పదవి కోసం బీసీ సామాజిక వర్గానికి చెందిన గుణగంటి హేమాసతీష్, బైరు శైలేందర్, కుమ్మరికుంట్ల వేణుగోపాల్, వెలుగు వెంకన్న, మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన షేక్ జహీర్, షపీఉల్లా పోటీ పడుతున్నారు.
కోదాడలో నలుగురు ఆశావహులు
కోదాడ మున్సిపల్ చైర్మన్ పదవి కోసం నలుగురు పోటీ పడుతున్నారు. దేవరపల్లి మల్లేశ్వరి, ఎర్నేని కుసుమ, పార సత్యవతి పదవిని ఆశిస్తున్నారు. వైస్ చైర్మన్ పదవి బీసీలకు ఇస్తే కందుల కోటేశ్వర్‌రావు రేసులో ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని మోయినాబాద్‌లోని ఓ రీసార్ట్‌లో ఉన్న వారితో శనివారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి చర్చించారు. తుది నిర్ణయం తీసుకోలేదు. ఆదివారం మరోసారి చర్చించి 16వ తేదీనే నిర్ణయం తీసుకోనున్నారు.
నేరేడుచర్లలో ఇద్దరు పోటీ..
నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ జనరల్ కావడంతో కొణతం చిన్నవెంకట్‌రెడ్డి, నూకల సందీప్‌రెడ్డి పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరికి చైర్మన్ పదవి దక్కితే వైస్ చైర్మన్ ఎవరికి ఇస్తారనే దానిపై చర్చ సాగుతోంది.
హుజూర్‌నగర్‌లో మంత్రి నిర్ణయమే ఫైనల్
హుజూర్‌నగర్ మున్సిపల్ చైర్మన్ పదవిని తన్నీరు మల్లికార్జునరావు, దొంతగాని శ్రీనివాస్ ఆశిస్తున్నారు. వైస్ చైర్మన్ పదవి కోసం కోతి సంపత్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ విషయంపై మంత్రి ఉత్తమ్ నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారు ముందే ప్రకటించారు. దీంతో మంత్రి 16వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లను ప్రకటించునున్నారు. ఎన్నికలకు ముందురోజు క్యాంపునకు వెళ్లిన వారంతా శుక్రవారమే తిరిగి వచ్చారు.
తిరుమలగిరిలో
రఘునందన్‌రెడ్డికే చాన్స్
తిరుమలగిరి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీ ముందుగానే సంకెపల్లి రఘునందన్‌రెడ్డి పేరును చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన్నే చైర్మన్‌గా ఎన్నుకునే అవకాశం ఉంది. ఇక వైస్ చైర్మన్ ఎవరన్నది ఇంతవరకు ప్రకటించలేదు. ప్రస్తుతం క్యాంపులోనే ఉన్న ఆ కౌన్సెలర్లు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
సూర్యాపేట చైర్మన్‌గా నివేదిత
లక్ష్యాది పేరు ఇప్పటికే ప్రకటన
వైస్ చైర్మన్ ఎవరన్న దానిపైనే చర్చ
ఇతర మున్సిపాలిటీల్లోనూ
ఫైనల్ కాని చైర్మన్, వైస్ చైర్మన్
క్యాంపునకు తరలివెల్లిన కౌన్సిలర్లు
16వ తేదీన నేరుగా సమావేశాలకు
ఎక్స్ అఫీషియో ఓటు నమోదుకు యత్నం
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సి పాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఓటు వేసేందుకు ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకునేందుకు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి శనివారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. తన ఓటు నమోదు చేయాలని మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావును ఆయన కోరారు. సర్కులర్ నంబర్ 402 ప్రకారం మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న వారికే ఓటు హక్కు ఉంటుందని కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ ఓటు నమోదు చేసుకోవడానికి వస్తే గంటల కొద్దీ కూర్చోబెట్టి, చివరకు తన అభ్యర్ధనను తిరస్కరించారని తెలిపారు.
పీఠంపై ఉత్కంఠ


