20 వరకే పత్తి కొనుగోళ్లు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో సీసీఐ ద్వారా ఈ నెల 20వ తేదీ వరకే పత్తి కొనుగోలు చేయనున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి కోటా నాగేశ్వరశర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కపాస్ కిసాన్ యాప్‌లో రిజిస్టర్ అయిన రైతులు స్లాబ్ బుక్ చేసుకుని ఈలోగానే పత్తిని మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించారు.
గోదావరి జలాల నిలిపివేత
అర్వపల్లి : యాసంగి సీజన్‌కు జిల్లాకు వారబందీ విధానంలో గోదావరి జలాలు విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాకు విడుదల చేస్తున్న గోదావరి జలాలను శనివారం అధికారులు నిలిపివేశారు. తిరిగి ఈ నెల 21 నుంచి 28 వరకు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
నేడు మఠంపల్లికి బిషప్
మఠంపల్లి : మండల కేంద్రంలోని శుభవార్త చర్చికి ఆదివారం నల్లగొండ మేత్రాసన పీఠాధిపతి (బిషప్) డాక్టర్ దమన్‌కుమార్ రానున్నారు. ఈ సందర్భంగా స్థానిక రెవరెండ్ ఫాదర్ రాజారెడ్డి పోగుల విలేకరులతో మాట్లాడారు. బిషప్ శుభవార్త చర్చిని మేరీమాత పుణ్యక్షేత్రంగా ప్రకటించనున్నారని తెలిపారు. దాంతో ఏప్రిల్‌లో జరిగే చర్చి వార్శికోత్సవాల నుంచి ఈ చర్చి మేరీమాత పుణ్యక్షేత్రంగా వాడుకలోకి వస్తుందన్నారు. బిషప్ చర్చిలో దివ్యబలిపూజ చేసి క్రైస్తవులకు ఆధ్యాత్మిక ప్రసంగం చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఫాదర్ అశోక్, శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్‌రెడ్డి, చర్చి కమిటీ సభ్యులు ఉన్నారు.
మట్టపల్లిలో నిత్యారాధనలు
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శనివారం నిత్యారాధనలు కొనసాగాయి. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం జరిపారు. ఆ తర్వాత రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్ల గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. చివరగా నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
మార్కెట్‌కు మూడు రోజులు సెలవు
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కార్యదర్శి సురేష్ శనివారం ఒక ప్రకటన తెలిపారు. 15న ఆదివారం, 16న శివరాత్రి, 17న అమావాస్య కావడంతో ఈ మూడు రోజులు మార్కెట్ గేటు మూసి ఉంటుందని పేర్కొన్నారు. సెలవు రోజులలో రైతులు మార్కెట్ యార్డుకు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకురావద్దని సూచించారు. ఈ నెల 18న మార్కెట్ తెరుచుకుంటుందని పేర్కొన్నారు.
మున్సిపల్ చైర్మన్‌గా బీసీలకు అవకాశమివ్వాలి
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మున్సిపల్ చైర్మన్‌గా బీసీలకు అవకాశం కల్పించాలని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ వీరబోయిన లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయినా ఉమ్మడి నల్ల గొండ జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సూర్యాపేట జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా బీసీలకు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ఆయన వెంట తెలంగాణ స్టూడెంట్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్‌కుమార్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ బయ్యా రాజేశ్, తెలంగాణ స్టూడెంట్ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మాదిపల్లి సాయితేజ, బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పరాల సాయియాదవ్, బీసీ సంఘా నాయకులు పాల్గొన్నారు.
20 వరకే పత్తి కొనుగోళ్లు


