అవినీతి రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట మున్సిపాలిటీని అవినీతి రహితంగా తీర్చి దిద్దాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కొత్తగా ఎన్నికై న సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు శనివారం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 31 స్థానాలలో విజయం సాధించిన కౌన్సిలర్లను ఆయన అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జాతీయ రహదారి మీద ఉన్న సూర్యాపేట పట్టణం ఇప్పటివరకు సరైన అభివృద్ధి సాధించలేక పోయిందన్నారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద చూపిన ఆదరణ ఎంతో గొప్పదన్నారు, ప్రజలు అపారమైన నమ్మకంతో ఓటేసి గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా కౌన్సిలర్లు పని చేయాలన్నారు. సూర్యాపేట పట్టణాభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానన్నారు. ఎప్పటికప్పుడు పట్టణాభివృద్ధిపై సమీక్షించుకొని ప్రత్యేక ప్రణాళికలు రూపొందించేందుకు కార్యాచరణ రూపొందించుకుందామని, అందుకు సరిపడా నిధులు తెచ్చి సూర్యాపేటను అభివృద్ధి పథంలో నడిపిద్దామని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పీసీసీ కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ఉన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి


