లెక్క.. లక్ష్యాన్ని చేరేనా!
నత్తనడకన చిన్ననీటి వనరుల గణన
పూర్తిగా మొబైల్ యాప్‌లోనే..
ఈ నెలలో పూర్తి చేస్తాం
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో చిన్న నీటి వనరుల గణన నత్తనడకన సాగుతోంది. నవంబర్ 14న ప్రారంభమైన సర్వే ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా.. 14 శాతానికి మించలేదు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల విధుల్లో సిబ్బంది బిజీగా ఉండడం జాప్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
పరిగణలోకి తీసుకుంటున్న
నీటి వనరులు ఇవీ..
నీటిపారుదల రంగంలో ప్రణాళిక,విధాన రూపకల్పన, సమగ్ర సమాచారం కోసం జలశక్తి కార్యక్రమంలో భాగంగా కేంద్రం ప్రతి ఐదేళ్లకోసారి చిన్ననీటి వనరుల గణన చేపడుతుంది. తద్వారా జిల్లాలో చిన్ననీటి వనరులు ఎన్ని ఉన్నాయనేది నిర్ధారించడంతో పాటు, నీటి లభ్యతను అంచనా వేస్తారు. దీని ప్రకారం కేంద్రం అవసరమైన నిధులు విడుదల చేసే అవకాశం ఉంటుంది. చివరిసారిగా 2017–18 సంవత్సరంలో చిన్న నీటి వనరుల గణన నిర్వహించారు. గణనలో భాగంగా గొట్టపు బావులు, ఓపెన్ బావులు, చెరువులు, కుంటలతో పాటు రెండు వేల హెక్టార్లలోపు సాగునీరు అందించే మినీ ప్రాజెక్టులను పరిగణలోకి తీసుకుంటున్నారు.
ఆగుతూ.. సాగుతూ
చిన్ననీటి వనరుల గణనకు ఎన్యూమరేటర్లను నియమించి శిక్షణ ఇచ్చారు. అయితే కొందరు ఎన్యూమరేటర్లు మొదట్లో ఆసక్తి చూపలేదు. దీంతో గ్రామపాలన అధికారులు, ఉపాధిహామీలో పనిచేస్తున్న టెక్నికల్, ఫీల్డ్ అసిసెంట్లకు బాధ్యతలు అప్పగించగా.. వాళ్లు కూడా పట్టించుకో లేదు. ఈ లోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం, జీపీఓలు బిజీగా మారడంతో ప్రక్రియ నిలిచిపోయింది. తిరిగి సర్వే చేయాల్సిందిగా ఇటీవల ఎన్యూమరేటర్లకు ఆదేశాలు అందగా.. ఇప్పటి వరకు కేవలం 14 శాతం మాత్రమే పూర్తి చేశారు. ఈనెలాఖరులోగా సర్వే పూర్తవడం కష్టంగానే ఉంది.
ఫ నవంబర్‌లో ప్రారంభమైనా 14 శాతమే పూర్తి
ఫ యాప్‌లో నమోదుకు ఎన్యూమరేటర్ల అవస్థలు
ఫ ఈ నెలాఖరు నాటికి పూర్తికావడం అనుమానమే
గతంలో మ్యానువల్‌గా చిన్ననీటి వనరుల గణన చేపట్టేవారు. సర్వే కోసం ప్రత్యేకంగా ఇచ్చిన పుస్తకాల్లో గ్రామాల వారీగా వివరాలు నమోదు చేసేవారు. అయితే పారదర్శకత కోసం సర్వే చేసే విధానంలో తాజాగా మార్పులు చేశారు. సర్వే మొత్తం ప్రత్యేకంగా రూ పొందించిన మొబైల్ యాప్ ద్వారా చేస్తున్నారు. గ్రామాలవారీగా గుర్తించిన చిన్న నీటి వనరులకు జియో ట్యాగింగ్ చేయడంతో పాటు ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. 34 అంశాలపై సర్వే చేస్తున్నారు. అయితే బోరు, బావి, ఇతర నీటి వనరుల ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేసే క్రమంలో సాంకేతిక సమస్యలు, క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది అంటున్నారు.
చీన్న నీటి వనరుల గణన కొనసాగుతోంది. ఇప్పటి వరకు 14 శాతం పూర్తయింది. ఎన్నికల విధులు కారణంగా కొంత ఆలస్యమైంది. ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ఎన్యూమరేటర్లకు ఆదేశాలిచ్చాం. పూర్తి కాగానే ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేస్తాం.
–కిషన్, సీపీఓ, సూర్యాపేట జిల్లా


