గోదావరి జలాల నిలిపివేత
అర్వపల్లి: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) రెండో దశ పరిధిలోని సూర్యాపేట జిల్లాకు శనివారం నీటి సరఫరాను నిలిపివేశారు. యాసంగి సీజన్ మొదటి తడికి గాను ఈనెల 7వ తేదీన 69,70,71 డీబీఎం మెయిన్ కాలువలకు గోదావరి జలాలు విడుదల చేశారు. వారబంధీ విధానంలో ఈనెల 14 వరకు నీటిని ఇవ్వాల్సి ఉండగా, మూడు రోజులు అదనంగా 17వ తేదీ వరకు వదిలారు. తిరిగి వారబంధీ విధానంలో జిల్లాకు నీటిని పునరుద్ధరిస్తామని జలవనరులశాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. కాగా వారబంధీ పద్ధతిలో కాకుండా నిరంతరం నీటిని విడుదల చేయాలని రైతులు కోరారు.
సాగు చట్టాలపై అవగాహన అవసరం
పెన్‌పహాడ్ : సాగు చట్టాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి రజిత సూచించారు. పెన్‌పహాడ్ రైతువేదికలో శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుంటే మరింత వృద్ధిలోకి రావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ నామినేటెడ్ మెంబర్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుంటూరు మధు, బొల్లెద్దు వెంకటరత్నం, భట్టిపల్లి ప్రవీణ్‌కుమార్, తహసీల్దార్లు, ఎస్‌ఐ గోపికృష్ణ, సర్పంచ్ ఒగ్గు రవి, ఆర్‌ఐ రంజిత్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ సభకు తరలిరండి
చిలుకూరు: సీపీఐ వందేళ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకేటశ్వర్లు పిలుపునిచ్చారు. చిలుకూరులోని సీపీఐ భవన్‌లో శనివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ వందేళ్ల ప్రస్థానంలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసిందన్నారు. సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, కర్షకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి సాహెబ్ అలీషా, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి కొండలు, ఫేక్ జానీపాషా, కందుకూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
గోదావరి జలాల నిలిపివేత


