బసవన్నలతో భుక్తి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : మండలంలోని ఏనుబాముల గ్రామానికి చెందిన బత్తుల వెంకట్రాములు గంగిరెద్దులను ఆడించడమే వృత్తిగా ఎంచుకొని జీవనం సాగిస్తున్నాడు. దాంతో ఇతడి పేరే గంగిరెద్దుల వెంకట్రాములుగా మారిపోయింది. వెంకట్రాములుతో పాటు అతడి కుటుంబ సభ్యులు సైతం తాతల కాలం నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. సంక్రాంతితో పాటు ఇతర రోజులలోకూడా గంగిరెద్దులను ఆడిస్తూ మండలంలోని అన్ని గ్రామాలకు వెళ్తుంటారు. శుభ, అశుభ కార్యాలకు సైతం వీరిని ఆహ్వానిస్తుంటారు. దశదిన కార్యాలకు, కొందరు పెద్ద రైతులు, భూస్వాములు అందించే కొడే దూడలను తీసుకొచ్చి తమ వద్దే ఉంచుకొని ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. దూడలను గంగిరెద్దుగా మార్చేందుకు రెండు, మూడేళ్ల పాటు శిక్షణ ఇచ్చి ఆ తరువాత రంగంలోకి దింపుతారు. గంగిరెద్దులను వెంకట్రాములు కుటుంబం దైవంలా భావిస్తుంటారు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు, మూడురోజులుగా వివిధ గ్రామాల్లో తిరుగుతూ గంగిరెద్దులను ఆడిస్తున్నారు.


