ఇంకెన్నాళ్లకు గృహయోగం..
కోదాడ: మున్సిపాలిటీ పరిధిలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఉద్దేశపూర్వకంగానే పంపిణీ చేయడం లేదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులతో కలిసి సోమవారం కోదాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 560 డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి, లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేశామని చెప్పారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు పొజిషన్ చూపకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. అధికారులు స్పందించి తక్షణమే ఇళ్లు పంపిణీ చేయాలని కోరారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కోదాడ పట్టణ అద్యక్షుడు ఎస్.కె. నయీం, నాయకులు పి.సత్యబాబు, కర్ల సుందర్‌బాబు, అల్వాల వెంకట్, ఉపేందర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.


