పెరిగిన మెస్ చార్జీలు
చిలుకూరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఇస్తున్న చార్జీలు సరిపోవడం లేదని, పెరిగిన సరుకుల ధరల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వంట ఏజేన్సీ మహిళలు ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మెస్ చార్జీలు పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు మరింత నాణ్యమైన మధ్యాహ్న భోజనం లభించనుంది.
1435 ఏజెన్సీలకు లబ్ధి
జిల్లాలో 600 ప్రాథమిక, 76 ప్రాథమికోన్నత, 182 ఉన్నత పాఠశాలలు మొత్తం 858 ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో చదివే పిల్లలకు మధ్యాహ్నం భోజనం వండి పెట్టేందుకు మొత్తం 1435 ఏజెన్సీలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీ మహిళలు ప్రభుత్వం అందించే మెస్ బిల్లుల్లోనే బయటి నుంచి సరుకులు తీసుకు రావడంతో పాటు వంట చేసేందుకు అవసరమైన వంట సరుకు, తమ కూలి అన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దానికి తోడు ప్రస్తుతం పెరిగిన నిత్యావసరాల ధరలతో విద్యార్థులకు వంటచేసి పెట్టడం తలకు మించిన భారంగా మారుతోందని వంట కార్మికులు వాపోతున్నారు. వంట చార్జీలు పెంచాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి 74 పైసలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రూ.1.12 పైసల చొప్పున వంట ధరలు పెంచింది. దాంతో వంట కార్మికులకు కొంత వరకు ఉపశమనం కలుగనుంది.
43,469 మంది విద్యార్థులకు భోజనం
జిల్లాలో ఉన్న 858 ప్రభుత్వ పాఠశాలల్లో 43,469 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి వంట ఏజెన్సీ వారు ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం వండి పెడుతున్నారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. దానికి తోడు వంట పాత్రలను కూడా సరఫరా చేసింది. మిగిలిన సరుకులను వంట ఏజెన్సీల నిర్వాహకులు కొనుగోలు చేసి వంట చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును బట్టి ప్రభుత్వం ప్రతినెలా భోజన బిల్లులను మంజూరు చేస్తోంది. ప్రస్తుతం పెరిగిన మెస్ చార్జీల వల్ల అటు వంట ఏజెన్సీలకు ఇటు విద్యార్థులకూ ప్రయోజనం కలుగనుంది.
పెరిగిన వంట ధరలు
(ఒక్కో విద్యార్థికి రూపాయల్లో)
పాఠశాల పాత ధర కొత్త ధర
ప్రాథమిక 5.45 6.19
ప్రాథమికోన్నత 8.17 9.29
ఉన్నత పాఠశాల 10.67 11.79
ఫ మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు లబ్ధి
ఫ పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా పెంపు
ఫ విద్యార్థులకు అందనున్న నాణ్యమైన భోజనం
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల వివరాలు
ప్రాథమిక పాఠశాలలు 600
ప్రాథమికోన్నత పాఠశాలలు 76
ఉన్నత పాఠశాలలు 182
మొత్తం విద్యార్థులు 43,469
వంట ఏజెన్సీలు 1435


