బాల మేధావులు.. సృజనకు పదును
సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట : విద్యార్థులను భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే కాకుండా వారిలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఏటా కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ, రాష్ట్ర విద్యాశాఖ సంయుక్తంగా వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ మనక్ పోటీలను నిర్వహిస్తోంది. సామాజిక సమస్యలకు పరిష్కారం చూపుతూ రెండు కార్యక్రమాల్లో వైజ్ఞానిక, గణిత, పర్యావరణ అంశాలపై రూపొందించిన నమూనాలను విద్యార్థులు ప్రదర్శించనున్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇన్‌స్పైర్ మనక్ పోటీల్లో జిల్లాలో 64 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వీటితో ఈ నెల మూడో వారం లేక చివరి వారంలో జిల్లాలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది.
విద్యార్థుల ఖాతాల్లో రూ.10వేలు జమ
ఇన్‌స్పైర్ మనక్ పోటీల్లో ఎంపికై న 64 ప్రదర్శనలకు సంబంధించి రూ.10వేల చొప్పున సంబంధిత విద్యార్థుల ఖాతాల్లో జమ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఆ నగదుతో ప్రాజెక్టులు రూపొందించి ప్రదర్శించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో ఎంపికై న ఉత్తమ నమూనాలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. ఈ మేరకు వైజ్ఞానిక ప్రదర్శన రాష్ట్ర విద్య, పరిశోధన శిక్షణ మండలి, రాష్ట్ర బాల వైజ్ఞానిక ప్రదర్శన పేరుతో నమూనాలు ప్రదర్శించనున్నారు. అభివృద్ధి, స్వయం సమృద్ధి చెందే భారతదేశానికి శాస్త్ర సాంకేతిక రంగాలైన టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం ఆవశ్యకత అనే అంశాలతో నమూనాలు రూపొందించాల్సి ఉంటుంది. ఏడు అంశాల్లో జూనియర్ విభాగంలో (6 నుంచి 8వ తరగతి వరకు), సీనియర్ విభాగంలో 9 నుంచి 12వ తరగతుల విభాగాల్లో ఉత్తమమైన 20 ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నారు.
మొత్తం ఏడు అంశాల్లో...
జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2025–26లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొననున్నారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో ఏడు అంశాలు ఉన్నాయి. ఇందులో 1.సుస్థిర వ్యవసాయం, 2.వ్యర్థ పదార్థాల నిర్వహణ, 3.ప్రత్యామ్నాయ మొక్కలు, 4.హరితశక్తి(పునరుత్పాదక శక్తి), 5.అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వినోదభరిత గణిత నమూనాలు, 6.ఆరోగ్యం, పరిశుభ్రత, 7.నీటి సంరక్షణ– నిర్వహణ అంశాలు ఉండనున్నాయి. ఒక పాఠశాల నుంచి గరిష్టంగా ఏడుగురు ఏడు ప్రాజెక్టులతో మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. ఏడు ప్రాజెక్టులు వచ్చినా ఒక గైడ్ టీచర్ మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది.
ప్రతి స్కూల్ నుంచి 1నుంచి 7ప్రాజెక్టుల వరకు..
జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ఈ నెల మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 180, ప్రైవేట్ పాఠశాలలు 250, ప్రాథమికోన్నత పాఠశాలలు 70, కేజీబీవీలు 18, మోడల్ స్కూల్స్ తొమ్మిది, అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్‌స్కూల్స్ 12 ఉన్నాయి. వీటిలో ప్రతి స్కూల్ నుంచి 1 నుంచి 7 ప్రాజెక్టుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే జిల్లాలో మొత్తం 250 నుంచి 300 ప్రాజెక్టులు సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శించనున్నారు.
ఈ నెల మూడో వారంలో
జిల్లాలో సైన్స్ ఫెయిర్
సన్నాహాలు చేస్తున్న విద్యాశాఖ
అధికారులు
300 ప్రాజెక్టులు ప్రదర్శించే అవకాశం
జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలతో పాల్గొనవచ్చు. ఉపాధ్యాయులు కూడా బోధనోపకరణాలు, నూతన ఆవిష్కరణలు ప్రదర్శించే అవకాశం ఉంది. వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి ఎల్.దేవరాజ్‌ను సంప్రదించాలి. – అశోక్, డీఈవో


