మొదటి అదనపు జడ్జిబాధ్యతల స్వీకరణ
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తిగా డాక్టర్ రాధాకృష్ణ చౌహాన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హూజూర్ నగర్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, గుంటూరు మధు, బాణాల విజయ్ కుమార్, రాచకొండ యాదగిరి, అనంతుల సందీప్ కుమార్, జవ్వాజీ సతీష్, కాసం సతీష్ తదితరులు పాల్గొన్నారు.
26న భగవద్గీత
కంఠస్థ పోటీలు
సూర్యాపేట : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గీతా జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ సహకారంతో పాఠశాల విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించనున్నట్లు కార్యక్రమ ఉమ్మడి నల్లగొండ జిల్లా నిర్వాహకులు సేవాలా నాయక్, విశ్వహిందూ పరిషత్ సూర్యాపేట పట్టణ కార్యదర్శి బైరు విజయకృష్ణలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో దైవభక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. సూర్యాపేట పట్టణంలోని జనగామ క్రాస్‌రోడ్డులోగల టీటీడీ కల్యాణ మండలంలో ఈ కార్యక్రమం ఉంటుందని, దీనికి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
ఉదయం 9గంటల్లోపు ఆరోగ్య పరీక్షలు పూర్తి చేయాలి
సూర్యాపేట : ఆర్‌బీఎస్‌కే బృందాలు ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు రోజూ ఉదయం 9 గంటల్లోపు కంటి పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి పి.చంద్రశేఖర్ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్‌బీఎస్‌కే వైద్యులు, సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో డాక్టర్ కోటి రత్నం, ఆర్‌బీఎస్‌కే వైద్యులు, సిబ్బంది, డాక్టర్ అశ్రీత, డిప్యూటీ డీఎంఓ సంజీవరెడ్డి పాల్గొన్నారు.
కేజీబీవీలో లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
మఠంపల్లి: మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం సమీపంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఇంటర్ సివిక్స్, ఇంగ్లిష్ లెక్చరర్ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ విజయకుమారి తెలి పారు. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, బీఈడీ, టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 12వ తేదీ వరకు నేరుగా విద్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఎక్స్‌గ్రేషియా బకాయిలు విడుదల చేయాలి
సూర్యాపేట : ప్రమాదవశాత్తు తాటి, ఈత చెట్లపై నుంచి పడి మరణించిన గీత కార్మికులకు చెల్లించాల్సిన రూ.13 కోట్ల ఎక్స్‌గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గీత పనివారల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రేగటి లింగయ్య, కొండ కోటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ కె.సీతారామారావుకు వినతి పత్రాన్ని అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొమ్మగాని శ్రీనివాస్, పాలకూరి బాబు, దొరపెల్లి శంకర్, బూర వెంకటేశ్వర్లు, తొట్ల ప్రభాకర్, బొడ్డు రామచంద్రు, బండారు లక్ష్మయ్య, రెడ్డిమల్ల శ్రీను, పెద్ది వెంకన్న, బూర లింగయ్య, అయితే గాని వెంకన్న, పందుల జానయ్య పాల్గొన్నారు.
అందుబాటులో కూరగాయలు, పూల నారు
గరిడేపల్లి : గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లిలో గల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో కూరగాయలు, పూల నారు అందుబాటులో ఉందని కేవీకే శాస్త్రవేత్త నరేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టమాట, వంగ, పచ్చిమిర్చి, బంతి, చామంతి, పెరటి తోటల కూరగాయల విత్తనాల కిట్, కోకో పీట్ కావాల్సిన రైతులు గడ్డిపల్లి కేవీకేలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించాలని పేర్కొన్నారు. రైతులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.


